డేంజర్‌ జోన్‌లో బాలీవుడ్‌ భామలు! | Deepika Padukone And Kiara Advani, Top Bollywood Actress Career Now In Danger Zone | Sakshi
Sakshi News home page

డేంజర్‌ జోన్‌లో బాలీవుడ్‌ భామలు.. హిట్‌ పడాల్సిందే!

Dec 7 2025 3:34 PM | Updated on Dec 7 2025 4:25 PM

Deepika Padukone And Kiara Advani, Top Bollywood Actress Career Now In Danger Zone

మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్‌ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్‌ని సౌత్‌ బ్యూటీస్‌ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అవుతుంటే.. బాలీవుడ్‌ భామలు మాత్రం కెరీర్‌ విషయంలో తడబడుతున్నారు.  వరుస అపజయాల కారణంగా పాన్‌ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు.

అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటే
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో అలియాభట్‌ ఒకరు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఆమె ఇమేజ్‌ మరింత పెరిగింది. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్‌ మాత్రం  పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

హిట్‌ కోసం కృతి ఎదురుచూపులు
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్‌ లేదు. ధనుష్‌తో కలిసి నటించిన  'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.

కియారాకు వరుస షాకులు
అందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్‌ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్‌ ఛేంజర్‌ వరకు ఇలా ఆమె నటించిన భారీ​ చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.

‘కండీషన్ల’తో రిస్క్‌ చేస్తున్న దీపిక
బాలీవుడ్‌ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్‌ని రిస్క్‌లో పెడుతోంది. స్పిరిట్‌లో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్‌ నచ్చక దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్  నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. 

అందులో ఒకటి షారుఖ్‌ ఖాన్‌ ‘కింగ్‌’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది. మరొకటి అల్లు అర్జున్‌-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్‌ అంటూ దీపికా తన కెరీర్‌ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. 

ఒవైపు సౌత్‌ స్టార్ల డామినేషన్‌..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్‌ కెరీర్‌ డేంజర్‌ పడింది. బాలీవుడ్‌లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్‌గా భారీ హిట్‌ పడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement