మంచిమాట
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి. ఆ రథం ఎటు వెళ్ళాలో మనసు నిర్ణయిస్తుంది. అయితే, ఆ మనసును నడిపించాల్సిన పరమసారథ్యం కేవలం మన స్వీయ నియంత్రణలోనే ఉంది.
భావోద్వేగాలనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటేనే మన జీవిత ప్రయాణం సవ్యంగా, నిర్దేశిత గమ్యం వైపు సాగుతుంది. ఒకవేళ ఈ పగ్గాలు వదిలేస్తే, అవి మనల్ని అదుపుతప్పి, పదేపదే నిరాశ, దుఃఖం అనే లోయల్లో పడేస్తాయి. మనసు మన అధీనంలో లేకపోతే, జీవితం ఒక నిరంతర పోరాటంలా మారి, శాశ్వత ఆనందాన్ని దూరం చేస్తుంది. మన అంతర్గత ప్రశాంతతకు ఇదే పునాది.
సాధారణంగా మన భావోద్వేగాలు సముద్రంలో ఉప్పొంగే శక్తిమంతమైన అలల మాదిరిగా ఉంటాయి. కోపం, దుఃఖం, భయం, అసూయ వంటివి మనల్ని క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి, అనాలోచిత నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కానీ, సనాతన ధర్మం బోధించినట్టుగా, మనం కేవలం మన భావోద్వేగాలకు బానిసలం కాదు; వాటిని శాసించగలిగే అపారమైన శక్తి కేంద్రం మనలోనే దాగి ఉంది. మనసును నిగ్రహించుకోవడానికి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు అత్యంత సులువైన, అద్భుతమైన మార్గాలుగా పనిచేస్తాయి.
కర్మ మార్గం–ఫలితాల ఆశ లేకుండా, కేవలం ఉన్నత లక్ష్యాల కోసం నిస్వార్థ నిబద్ధతతో మన కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్దేశిస్తుంది. చివరగా, భక్తి మార్గం–జీవితానికి అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే అని నిశ్చయంగా నమ్మి, విశ్వశక్తిలో లీనమవడమే. ఈ త్రికరణ శుద్ధి కలయిక మనసుకు తిరుగులేని స్థైర్యాన్ని, అఖండమైన అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుంది.
నిజమైన ఆత్మనిగ్రహం ద్వారానే మనం అంతరంగ శాంతికి శాశ్వత వారధిని నిర్మించగలం. ఈ వారధిని నిర్మించిన మహనీయుల జీవితాలు మనకు శాశ్వత ప్రేరణ. ఉదాహరణకు, సింహాసనం కళ్లముందే కరిగిపోయినప్పుడు, శ్రీరాముడు ఉవ్వెత్తున ఎగిసిన కోపాగ్నిని కేవలం అణచివేయలేదు. ఆయన వ్యక్తిగత ఆశను, ఆవేశాన్ని త్యజించి, ధర్మానికి శిరసు వంచారు.
ఇది కేవలం తండ్రి మాటకు గౌరవం కాదు, బాహ్య పరిస్థితులకు అతీతంగా తన అంతర్గత ప్రశాంతతను తానే నిర్ణయించుకునే అత్యున్నత వివేకం. అలాగే, మహాభారతంలో ధర్మరాజు, అపారమైన దుఃఖం, రాజ్య నష్టం మధ్య కూడా, తన స్థైర్యాన్ని పోగొట్టుకోకుండా, క్షమతో... వివేకంతో వ్యవహరించారు. ఈ ఉదాహరణలు కేవలం కథలు కావు; భావోద్వేగాలపై పట్టు సాధిస్తే, విధి రాతను సైతం తన జీవితపు ఉన్నత గమ్యానికి అనుగుణంగా మలచుకోవచ్చని నిరూపించాయి.
గుర్తుంచుకోండి: మన జీవితమనే ఈ అద్భుతమైన ప్రయాణంలో, మన గమ్యాన్ని నిర్దేశించే తిరుగులేని సారథులం మనమే. ఇక ఆలస్యం చేయక, ప్రతి క్షణాన్ని వివేకంతో, ప్రేమతో నింపి, మన హృదయం కోరుకునే ప్రశాంతమైన, అద్భుతమైన భవిష్యత్తును మన చేతులతో నిర్మించుకుందాం.
మన అంతర్గత ప్రపంచంలో కలిగే ప్రతి ఆలోచనా అలజడి, ప్రతి ప్రతిస్పందన ఒక కర్మగానే పరిగణించబడుతుంది. ఈ కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి, జ్ఞానయోగం మనకు నిష్పాక్షిక పరిశీలన అనే వివేకాన్ని అందిస్తుంది. అంటే, కళ్ళ ముందు జరిగే నాటకాన్ని చూస్తున్నట్లుగా, మన ఆలోచనలను, భావోద్వేగాలను తటస్థంగా, నిశితంగా గమనించడం. ఈ దృష్టి వివేకానికి పదునైన కత్తిలా పనిచేసి, ప్రతిచర్యలకు బదులుగా, ప్రశాంతమైన, సరైన ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది.
భావోద్వేగాలను నియంత్రించగలగడమే నిజమైన, నిస్సందేహమైన శక్తి. ఎందుకంటే, అది మనల్ని బాహ్య పరిస్థితుల బందీగా కాకుండా, మన స్వీయ మనసుకి నిజమైన అధిపతిగా నిలబెడుతుంది. అశాంతి, ఆందోళనల నుంచి సంపూర్ణ విముక్తి ΄÷ందడానికి, మనసును మనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా మలచుకోవాలి. యోగా, ధ్యానం, ఆత్మపరిశీలన వంటి సాధనల ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం.
– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు)


