charioteer
-
శల్య సారథ్యం అంటే..?
మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.– సి. ఎన్. మూర్తి,సీనియర్ పాత్రికేయులు -
జీవిత రథ సారథి
ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద సవాలు బయట ప్రపంచంతో కాదు, తన అంతరంగంలోనే ఉంది. మనం అనుక్షణం తీసుకునే వేలకొలది నిర్ణయాలు, మన స్పందనల పరంపర... ఇవన్నీ మన భావోద్వేగాల ప్రవాహంలోనే జన్మిస్తాయి. జీవితమనే రథానికి మనసు రథసారథి. ఆ రథం ఎటు వెళ్ళాలో మనసు నిర్ణయిస్తుంది. అయితే, ఆ మనసును నడిపించాల్సిన పరమసారథ్యం కేవలం మన స్వీయ నియంత్రణలోనే ఉంది. భావోద్వేగాలనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటేనే మన జీవిత ప్రయాణం సవ్యంగా, నిర్దేశిత గమ్యం వైపు సాగుతుంది. ఒకవేళ ఈ పగ్గాలు వదిలేస్తే, అవి మనల్ని అదుపుతప్పి, పదేపదే నిరాశ, దుఃఖం అనే లోయల్లో పడేస్తాయి. మనసు మన అధీనంలో లేకపోతే, జీవితం ఒక నిరంతర పోరాటంలా మారి, శాశ్వత ఆనందాన్ని దూరం చేస్తుంది. మన అంతర్గత ప్రశాంతతకు ఇదే పునాది.సాధారణంగా మన భావోద్వేగాలు సముద్రంలో ఉప్పొంగే శక్తిమంతమైన అలల మాదిరిగా ఉంటాయి. కోపం, దుఃఖం, భయం, అసూయ వంటివి మనల్ని క్షణాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి, అనాలోచిత నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కానీ, సనాతన ధర్మం బోధించినట్టుగా, మనం కేవలం మన భావోద్వేగాలకు బానిసలం కాదు; వాటిని శాసించగలిగే అపారమైన శక్తి కేంద్రం మనలోనే దాగి ఉంది. మనసును నిగ్రహించుకోవడానికి కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలు అత్యంత సులువైన, అద్భుతమైన మార్గాలుగా పనిచేస్తాయి.కర్మ మార్గం–ఫలితాల ఆశ లేకుండా, కేవలం ఉన్నత లక్ష్యాల కోసం నిస్వార్థ నిబద్ధతతో మన కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్దేశిస్తుంది. చివరగా, భక్తి మార్గం–జీవితానికి అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే అని నిశ్చయంగా నమ్మి, విశ్వశక్తిలో లీనమవడమే. ఈ త్రికరణ శుద్ధి కలయిక మనసుకు తిరుగులేని స్థైర్యాన్ని, అఖండమైన అంతర్గత బలాన్ని ప్రసాదిస్తుంది.నిజమైన ఆత్మనిగ్రహం ద్వారానే మనం అంతరంగ శాంతికి శాశ్వత వారధిని నిర్మించగలం. ఈ వారధిని నిర్మించిన మహనీయుల జీవితాలు మనకు శాశ్వత ప్రేరణ. ఉదాహరణకు, సింహాసనం కళ్లముందే కరిగిపోయినప్పుడు, శ్రీరాముడు ఉవ్వెత్తున ఎగిసిన కోపాగ్నిని కేవలం అణచివేయలేదు. ఆయన వ్యక్తిగత ఆశను, ఆవేశాన్ని త్యజించి, ధర్మానికి శిరసు వంచారు. ఇది కేవలం తండ్రి మాటకు గౌరవం కాదు, బాహ్య పరిస్థితులకు అతీతంగా తన అంతర్గత ప్రశాంతతను తానే నిర్ణయించుకునే అత్యున్నత వివేకం. అలాగే, మహాభారతంలో ధర్మరాజు, అపారమైన దుఃఖం, రాజ్య నష్టం మధ్య కూడా, తన స్థైర్యాన్ని పోగొట్టుకోకుండా, క్షమతో... వివేకంతో వ్యవహరించారు. ఈ ఉదాహరణలు కేవలం కథలు కావు; భావోద్వేగాలపై పట్టు సాధిస్తే, విధి రాతను సైతం తన జీవితపు ఉన్నత గమ్యానికి అనుగుణంగా మలచుకోవచ్చని నిరూపించాయి.గుర్తుంచుకోండి: మన జీవితమనే ఈ అద్భుతమైన ప్రయాణంలో, మన గమ్యాన్ని నిర్దేశించే తిరుగులేని సారథులం మనమే. ఇక ఆలస్యం చేయక, ప్రతి క్షణాన్ని వివేకంతో, ప్రేమతో నింపి, మన హృదయం కోరుకునే ప్రశాంతమైన, అద్భుతమైన భవిష్యత్తును మన చేతులతో నిర్మించుకుందాం.మన అంతర్గత ప్రపంచంలో కలిగే ప్రతి ఆలోచనా అలజడి, ప్రతి ప్రతిస్పందన ఒక కర్మగానే పరిగణించబడుతుంది. ఈ కర్మల ప్రభావాన్ని తగ్గించడానికి, జ్ఞానయోగం మనకు నిష్పాక్షిక పరిశీలన అనే వివేకాన్ని అందిస్తుంది. అంటే, కళ్ళ ముందు జరిగే నాటకాన్ని చూస్తున్నట్లుగా, మన ఆలోచనలను, భావోద్వేగాలను తటస్థంగా, నిశితంగా గమనించడం. ఈ దృష్టి వివేకానికి పదునైన కత్తిలా పనిచేసి, ప్రతిచర్యలకు బదులుగా, ప్రశాంతమైన, సరైన ఎంపికను ఎంచుకునే స్వేచ్ఛనిస్తుంది.భావోద్వేగాలను నియంత్రించగలగడమే నిజమైన, నిస్సందేహమైన శక్తి. ఎందుకంటే, అది మనల్ని బాహ్య పరిస్థితుల బందీగా కాకుండా, మన స్వీయ మనసుకి నిజమైన అధిపతిగా నిలబెడుతుంది. అశాంతి, ఆందోళనల నుంచి సంపూర్ణ విముక్తి ΄÷ందడానికి, మనసును మనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుడిగా మలచుకోవాలి. యోగా, ధ్యానం, ఆత్మపరిశీలన వంటి సాధనల ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం.– కె. భాస్కర్ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు) -
ఏదీ రథసారథి..
► రథసారథిలేని జిల్లా విద్యాశాఖ ► పరిహాసంగా మారిన ఇన్చార్జి బాధ్యతలు ఆరిలోవ: జిల్లా విద్యాశాఖ రథసారధి నియామకంలో ఉన్నతాధికారులు దోబూచులాడుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా పని చేసిన వెంకటకృష్ణారెడ్డి ఆర్జేడీగా పదోన్నతిపై వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచి ఎవరినీ డీఈవోగా నియమించలేదు. ఇన్చార్జి బాధ్యతలు డిప్యూటీ డీఈవోకు రేణుకకు అప్పగించారు. ఆమె ఆ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడవకముందే ఉన్నతాధికారులు అర్బన్ డిప్యూటీ డీఈవో జి.నాగమణికి ఆ బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అధికారులు మారినట్టయింది. సౌకర్యాలు సమకూరినా.. రూరల్ తహసీల్దారు కార్యాలయం పక్కన జాతీయ రహదారిని ఆనుకొని ఇటీవల నూతన డీఈఓ కార్యాలయం నిర్మించారు. దీని నిర్మాణం పనులు దగ్గరుండి చేపట్టిన అప్పటి డీఈఓ వెంకటకృష్ణారెడ్డి ఇక్కడ కుర్చీలో కూర్చోకుండానే పదోన్నతిపై ఫిబ్రవరిలో ఆర్జేడీగా రాజధానికి వెళ్లిపోయారు. దీంతో నూతన భవనంలో ఈ కుర్చీ ఖాళీ అయిపోయింది. ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. డిప్యూటీ డీఈఓలుగా పనిచేస్తున్న సీవీ రేణుక, జి.నాగమణిలలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలో సరిగా తేల్చుకోలేకపోయారు. అర్బన్ డిప్యూటీ డీఈఓగా పనిచేసిన నాగమణికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు వెంకటకృష్ణారెడ్డి రిలీవ్ కాబోయే ముందు రోజు ప్రకటించారు. రెండో రోజు ఆమె బాధ్యతలు స్వీకరిస్తారనుకొనే సమయంలో అదే రోజు అర్ధరాత్రి మళ్లీ ఉత్తర్వులు మారిపోయాయి. ఇన్చార్జ్ బాధ్యతలు రూరల్ పరిధిలో డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న సీవి రేణుకకు అప్పగించినట్లు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి పంపించారు. దీంతో రేణుక ఫిబ్రవరి 13న బాధ్యతలు తీసుకున్నారు. రేణుక తన సీనియారిటీని చూపించి ఉన్నతాధికారుల నుంచి రాత్రికి రాత్రే ఆర్డర్ తెప్పించుకోగలిగారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అర్బన్ డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్నాను.. నాకూ సీనియారిటీ ఉంది. ఆ బాధ్యతలు నాకే అప్పగించాలని కోరుతూ నాగమణి విద్యాశాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. దీంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు ఆమె విన్నపాన్ని పునఃపరిశీలించి శుక్రవారం రాత్రి నాగమణికి పూర్తి ఇన్చార్జి (ఎఫ్ఐసీ) బాధ్యతలు అప్పగించి, రేణుకకు మళ్లీ డిప్యూటీ డీఈఓగా రూరల్ బాధ్యతలు చూడాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో శనివారం రేణుక.. నాగమణికి బాధ్యతలు అప్పగించారు. కాగా.. డీఈఓ భవనంలో కుర్చీ కోసం ఇంకెన్ని ఆటలు చూడాల్సి వస్తుందో, ఎవరు పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారోనని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.


