శల్య సారథ్యం అంటే..? | Shalya becomes Karna Charioteer and discourages Karna at every stage of the war | Sakshi
Sakshi News home page

శల్య సారథ్యం అంటే..?

Apr 27 2026 5:56 AM | Updated on Apr 27 2026 5:56 AM

Shalya becomes Karna Charioteer and discourages Karna at every stage of the war

భారత విజ్ఞానం

మహాభారత సంగ్రామంలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక శైలి. వారిలో శల్యుడు ఒకరు. ఒకరిపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సాయం చేసే నెపంతో చేతులారా చెడగొట్టడంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడాన్ని శల్య సారధ్యం అంటారు.

శల్యుడు మద్ర దేశానికి అధిపతి, పాండురాజుకు రెండవ భార్య అయిన మాద్రికి సోదరుడు. మాద్రి సంతానమైన నకుల, సహదేవులకు మేనమామ. శల్యుడు అస్త్రవిద్య, గదా యుద్ధం, ముఖ్యంగా రథసారథిగా గొప్ప నేర్పరి. అలాంటి శల్యుడు పాండవుల పక్షాన ఉంటే వారిని గెలవడం కష్టమని గ్రహించిన దుర్యోధనుడు ఒక పథకం పన్నాడు. పాండవులను కలవడానికి వెళుతున్న శల్యుడికి  మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడా పెద్దపెద్ద గుడారాలు వేయిస్తాడు. ఆ గుడారాలు పాండవులవేనని అనుకొన్న శల్యుడు వాటిలోకి ప్రవేశిస్తాడు. అక్కడి సేవకులు శల్యునికి ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి, గౌరవ మర్యాదలు చేసి అద్భుతమైన విందును ఏర్పాటు చేశారు. ఇదంతా పాండవులు తన కోసమే చేశారనుకున్న శల్యుడు విందు ఆరగించి, వెంటనే సేవకునితో తక్షణమే వెళ్లి మీ యజమాని పిలుచుకొని రా... రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో నా మద్దతును తెలుపుతానని చెప్పాడు.

సేవకులతో పాటు దుర్యోధనుడు రావడంతో ఆశ్చర్యపడ్డ శల్యుడు జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఇచ్చిన మాటను వెనుకకు తీసుకోలేక మహా భారత సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉండేందుకు నిశ్చయించుకున్నాడు. అనంతరం శిబిరం నుండి బయలుదేరిన శల్యుడు పాండవులను కలుసుకొని జరిగిన సంఘటన వివరించాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడితో మాట్లాడుతూ, కౌరవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని, కానీ ఒక సహాయం చేస్తాననే మాట ఇమ్మని శల్యుణ్ణి అడిగాడు. అలాగే, అదేమిటో చెప్పమన్న శల్యుడితో ‘‘రథం తోలడంతో నీకు అద్భుతమైన ప్రతిభ ఉంది కాబట్టి కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని రథాన్ని తోలే అవకాశం వస్తే ఆ సమయంలో కర్ణుని అడుగడుగునా అవహేళన చేస్తూ, మానసికంగా, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాలి’’ అని  ధర్మరాజు కోరాడు. అందుకు అంగీకరించాడు శల్యుడు.

ఊహించిన విధంగానే మహాభారత సంగ్రామంలో 17వ రోజున కర్ణుని రథాన్ని తోలే బాధ్యతను శల్యునికి అప్పగించారు. కర్ణుని పరాక్రమాన్ని గమనించిన శల్యుడు అడుగడుగునా కర్ణుని అవహేళన చేస్తూ  సూటిపోటి మాటలతో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. ఒక సమయంలో కర్ణుడు వదిలిన అస్త్రాన్ని అర్జునుని తలపైకి కాకుండా గుండెల వైపు గురి పెట్టమని శల్యుడు సూచిస్తాడు. అప్పటికే శల్యుని పట్ల అపనమ్మకం ఏర్పడ్డ కర్ణుడు అస్త్రాన్ని తలవైపునకే గురిపెట్టడం, అర్జునిని రథ సార థ, జగన్నాటక సూత్ర ధారి అయిన శ్రీ కృష్ణుడు రథాన్ని కిందకు తొక్కడంతో ఎంతో శక్తిమంతమైన అస్త్రం అర్జునుని తలపై నుండి వెళ్ళిపోయి వ్యర్థ మైపోయింది. ఈ లోగా కర్ణుని శాపాలు అన్నీ కలిసి రావటంతో అర్జునుడు విడిచిన అస్త్రంతో కర్ణుడు మరణిస్తాడు. అప్పటి నుండి శల్య సారథ్యం అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది.

– సి. ఎన్‌. మూర్తి,సీనియర్‌ పాత్రికేయులు   

Advertisement
 
Advertisement
Advertisement