పాదం ఓ సంక్లిష్టమైన అవయవం. నడక సరిగా సాగుతున్నంత సేపూ దాని గొప్పదనం తెలియదు. నిర్మాణపరంగా (అనటామికల్‌గా) చూస్తే అదొక అబ్బురపరచే అవయవం. పాదం ప్రాధాన్యమేమిటో తెలుసుకుందాం.
పాదం గురించి తెలుసుకునే ముందు అసలు పాదం నిర్మాణాన్నీ, దాని పనితీరేమిటన్నది చూద్దాం.
26 ఎముకలు / 107 లిగమెంట్లు / 19 కండరాలు మొత్తం కాలిలో 30 ఎముకలు ఉంటే... సైలెంట్‌గా తనపని తాను చేసుకుపోయే పాదంలో 26 ఎముకలు ఉంటాయి. అంటే కాలితో పోల్చి చూసినప్పుడు 90 శాతం ఎముకలు పాదంలోనే ఉంటాయి. ఇందులో నడవడానికి ఉపయోగపడేలా 107 లిగమెంట్లు, 19 కండరాలు కూడా ఉంటాయి. ఓ వ్యక్తి బరువు 70కిలోలు అనుకుంటే... అతడి బరువును బ్యాలెన్స్ చేసేందుకు దేహంలోని పొడవైన ఎముక ‘ఫీమర్’ తొడలో ఉంటుంది. దీన్నే తెలుగులో తొడ ఎముక అని పేరు.
నడక... 70 కిలోల షాక్ తీసుకునే... సంక్లిష్ట ప్రక్రియ
మనం మనకు తెలియకుండా యాంత్రికంగా నడుస్తుంటాంగానీ... నిజానికి నడక చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. పాదం నేల మీద మోపగానే 70 కిలోల బరువుతో మొదటి షాక్ పాదం పైనే పడుతుంది. కానీ ఆ షాక్‌ను పాదానికి అంతటా సమంగా విస్తరింపజేస్తూ... ఆ షాక్‌ను తట్టుకునే షాక్ అబ్జార్బర్‌గా పనిచేస్తుంది పాదం.
ఇక ఆ పాదాన్ని వెనక్కుతోస్తూ తన గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) ముందుకు పడేలా చేస్తూ నడక సాగిస్తున్న వ్యక్తి కదులుతాడు. ఇలా గ్రావిటీవల్ల ముందుకుపడిపోయే లోపే... మరో కాలు ముందుకు పడి ఆ 70 కిలోల షాక్‌ను ఆ కాలు తీసుకుని మనిషి పడిపోవడం నుంచి ఆపుతుంది. ముందుకు పడిపోయేలా కదులుతూ... అలా పడిపోయే లోపు మరో కాలిని ఆనిస్తూ నడక సాగుతుంది. ఇలా నడక సాగించడాన్ని ‘బైపెడల్’ మూవ్‌మెంట్ అంటారు.
రోజులో 7,500 సగటు అడుగుల నడకలో జరిగేదేమిటంటే...
ఓ వ్యక్తి నడవడం మొదలుపెట్టాక ప్రతి నిమిషానికి ఉజ్జాయింపుగా 100 అడుగులు వేస్తుంటాడని అంచనా. అంటే అతడి రెండు కాళ్ల మీద ప్రతి నిమిషానికీ 70 కిలోల బరువు పడుతూ... ఒక్కో ΄ాదం మీదా ఇలా 50 సార్లు పడుతుంది. మొదట పాదం మోపగానే బరువంతా మడమలోని బంతిలాంటి ఎముకపై పడుతుంది. ఆ తర్వాత కాలివేళ్లలోని ఎముకలైన ఐదు మెటాటార్సల్స్‌పై పడుతుంది. వాటి సాయంతో పాదం నేలను వెనక్కుతోస్తుంది. కానీ నేల కదలదు కాబట్టి... అలా వెనక్కు నెట్టడం వల్ల ఆ వ్యక్తే ముందుకెళ్తుంటాడు. ఇలా ఆరోగ్యవంతుడైన ఓ వ్యక్తి రోజుకు 7,500 అడుగులు వేస్తాడని ఉజ్జాయింపుగా ఓ అంచనా.
ఏడాదికి 27,37,500 అడుగులూ... జీవితకాలంలో 22 కోట్ల అడుగులు
ఈ లెక్కన అతడు ఏడాదికి 27,37,500 అడుగులూ... ఒకవేళ అతడు ఆరోగ్యకరంగా 80 ఏళ్లు బతకగలిగితే... అతడి జీవితకాలంలో మొత్తం 21,90,00,000 అడుగులు (అంటే దాదాపుగా 22 కోట్ల అడుగులు) వేస్తాడు. అలా ఓ వ్యక్తి తన జీవిత కాలంలో లక్షా అరవై వేల కిలోమీటర్ల (లక్ష మైళ్ల) దూరాన్ని నడుస్తాడని ఒక అంచనా. (పుట్టిన ఐదేళ్ల వరకు పెద్దగా నడవడు కదా అనుకుని 75 ఏళ్లకే లెక్కవేస్తే... 20,53,12,500 అడుగులు వేస్తాడు. అంటే కనీసం 20 కోట్ల అడుగులైనా వేస్తాడు.
ఆ నడిచే దూరాన్ని భూమ్మీద భూమధ్య రేఖ వెంట ఇలా నడుస్తూపోతే భూమిని నాలుగుసార్లు చుట్టి వస్తాడు. ఒకవేళ భూమి నుంచి చంద్రుడివరకూ నడవగలిగేట్లయితే... భూమికీ చంద్రుడికీ మధ్యనున్న దూరం 3,84,400 కిలోమీటర్ల దూరంలో అటుఇటుగా దాదాపు నాలుగో వంతు నడుస్తాడు. ఈ లెక్కలను బట్టి చూస్తే ఓ జీవితకాలంలో పాదాలపై పడే బరువూ, భారమూ ఎంత అన్నది ఆలోచిస్తే... మన పాదాలు చేసే కష్టమెంతో అర్థమవుతుంది.
గచ్చు గట్టిదనంతో మరిన్ని గాయాలు...
ఒకప్పుడు మనమందరం దాదాపు పాదరక్షలేమీ లేకుండానే మట్టిపై నడిచేవాళ్లం కానీ... ఇప్పుడు సిమెంట్‌తో రూపొందిన కఠినమైన పేవ్‌మెంట్లు లేదా అలాంటి ఉపరితలాల మీద నడవాల్సి వస్తుంది. నిజానికి ఇలాంటి కఠినమైన ఉపరితలాల మీద నడిస్తే పాదాలకు నష్టం. దీనికి బదులు నడిచే సమయాల్లో మెత్తటి నేల, లేదా కాస్తంత బౌన్స్ ఇచ్చేలాంటి గడ్డి మీద నడవటం వల్ల పాదాలకు రక్షణ దొరుకుతుంది. అందుకే కఠినమైన ఉపరితలాల మీద వాకింగ్ అంతగా సిఫార్సు చేయదగినది కాదు. అయితే ఇప్పుడు చాలావరకు ప్రతిచోటా రోడ్లతో హార్డ్ సర్ఫేస్‌లు ఉంటున్నందున మెత్తగా ఉండే షూస్ ఎంపిక చేసుకోడం వల్ల పాదానికి తగిన రక్షణ దొరుకుతుంది.
పాదాలకు వచ్చే కొన్ని సమస్యలూ... పరిష్కారాలు...
ఇటీవల అందరూ షూస్ / బూట్లు తొడుగుతున్నారు. అందునా స్కూల్ పిల్లల వయసు నుంచే ఇది జరుగుతోంది. అయితే ఇలా షూస్, బూట్లతో చాలాసేపు పాదాల్ని బంధించి ఉంచడం సరికాదు. ఇది పూర్తిగా ఎదగని చిన్నారుల పాదాల ఎదుగుదలను దెబ్బతీయవచ్చు. అందుకే పాద సంరక్షణ కోసం కాస్తంత వదులుగానూ, తొడిగాక పాదం ముందర కాస్త ఖాళీ ఎక్కువగానూ ఉండేలా షూ ఎంచుకోవాలి. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమస్యను ‘బ్యూనియన్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించాలి..
చిన్నారులు స్కూల్ నుంచి రాగానే పిల్లలు షూస్ వదిలేసి... ఫ్రీగా ఉండే చెప్పులు, స్లిప్పర్స్ వంటి వాటిని తొడగాలి. ఇక మహిళల్లో విషయానికి వస్తే... వారు ధరించే హైహీల్స్ వల్ల పాదాలకు జరిగే ప్రమాదవకాశాలు పురుషులతో పొలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ.
కొందరిలో బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంటుంది. ఇలా జరగకూడదంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లోంచి మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకోవాలి. ఇక డయాబెటిస్ వంటి సమస్య ఉన్నవారు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలతో పాదాలను చాలావరకు సంరక్షించుకోవచ్చు.
షూ తొడిగినప్పుడు ఒకేచోట అదేపనిగా ఒత్తిడి పడుతుండటం వల్ల ఆనెకాయలు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని కొందరు బ్లేడ్‌తో కోస్తుండటం, మరికొందరు యాసిడ్ చుక్కలతో మాడ్చటానికి ప్రయత్నిస్తుంటారు. అది సరికాదు. డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి. ∙కొందరిలో పాదాలకు కాయకాచి అందులో పగుళ్లు ఏర్పడతుంటాయి. ఇలా జరిగినప్పుడు పాదాల డాక్టర్‌కు చూపించుకుని తగిన చికిత్స చేయించుకోవాలి.
కొందరిలో ఫంగస్ కారణంగా అథ్లెట్స్ ఫుట్ అనే సమస్య వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ పాదాలపై ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే పాదం ఎప్పుడూ తేమ, తడిలో ఉండటంతో అక్కడ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథులు స్రావాలతో పాదం తడిసినప్పుడూ ఈ సమస్య మరింత త్వరగా రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ బేస్‌డ్ వాష్‌లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ల సూచన మేరకు యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.
డా. సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్.
నిర్వహణ: యాసీన్


