breaking news
shalya
-
శల్యసారథ్యం.. కర్ణుడి పరాజయం
మద్రదేశపు రాజు శల్యుడు. పాండురాజు భార్య మాద్రికి స్వయానా అన్న. పాండవులకు మేనమామ. యుద్ధంలో పాండవులకు సహకరించడానికి బయలు దేరాడు. దారిలో దుర్యోధనుడు కుట్రతో ఆయనకు ఘనస్వాగతం పలికాడు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టాడు. శల్యుడు అది ధర్మరాజు చేస్తున్న సత్కారమనే అనుకుని ఆనందంగా స్వీకరించాడు. యుద్ధభూమికి చేరుకున్నాక కానీ నిజం తెలిసి రాలేదు. అప్పటికే చాలా ఆలస్యం అయింది. యుధిష్ఠిరుడి దగ్గరకు వెళ్లి, ‘‘నాయనా! నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివి. మీ పక్షాన నిలబడి యుద్ధం చేయాలని బయలు దేరాను. అయితే దుర్యోధనుడు దుర్బుద్ధితో నాకు ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. అవి మీరే చేసి ఉంటారనే భ్రమంతో నేను వాటన్నింటినీ స్వీకరించాను కాబట్టి అతడు దుర్మార్గుడైనప్పటికీ నేను అతని పక్షానే యుద్ధం చేయాల్సి వస్తోంది. కానీ నీవు ధర్మపరుడివి, రాజనీతిజ్ఞుడివి కాబట్టి ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడే ఉపాయం ఆలోచించు’’ అన్నాడు. ఏమి చేయమంటార ని ధర్మరాజు కృష్ణుడిని సలహా అడిగాడు. అప్పుడు కృష్ణుడిలా చెప్పాడు. ‘‘దుర్యోధనుడి సైన్యంలో కర్ణుడు మహాపరాక్రమవంతుడు. భీష్మ, ద్రోణులు కూడా పరాక్రమవంతులైనప్పటికీ వారు మనస్పూర్తిగా ధర్మరాజు విజయం కోరుకుంటున్నవారే. కాని కర్ణుడు అలా కాదు. దుర్యోధనుడికి ప్రాణమిత్రుడు. పొరపాటున కూడా అతడు ఓడిపోవాలని కోరుకోడు. పరశురాముడి శిష్యుడు, మహావీరుడు అయిన కర్ణుడిని ఓడించడం అసంభవం. అయితే, శల్యుడు మాత్రమే ఈ అసంభవాన్ని సంభవం చేయగల సమర్థుడు. కాబట్టి, మీరు శల్యుడిని కర్ణుడి రథసారథ్యం వహించమని కోరండి’’ అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు శల్యుడిని ‘‘మామా! కర్ణుడు కురుసేనకు సైన్యాధిపతి అయినప్పుడు మీరు అతని రథసారథిగా ఉంటూ, అతని మనోబలాన్ని నిరంతరం తగ్గిస్తూ ఉండాలి. ఇందుకోసం మీరు కర్ణుడి వ్యక్తిగత జీవితంలోవి, దుర్యోధనుడి సైన్యంలోని లోటుపాట్లు వినిపిస్తూ, అతన్ని, అతని సైన్యాన్ని నిరంతరం నిందిస్తూ, అతని మనోబలాన్ని కృంగదీయండి’’ అని కోరాడు. అందుకు అంగీకరించిన శల్యుడు పాండవులు కోరినట్లే సరైన సమయానికి సారథ్యం వహించి, కర్ణుడిని, అతని సైన్యాన్ని నిందిస్తూ, అంచలంచలుగా అతని మనోబలాన్ని దెబ్బతీశాడు. దాంతో కర్ణుడు యుద్ధంలో ఏకాగ్రతను కోల్పోయి, కౌరవుల పరాజయానికి పరోక్ష కారకుడయ్యాడు. అందుకే ఎవరైనా మన పక్షంలోనే ఉంటూ, మనోబలాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే అలాంటి వారిని శల్యసారథ్యం చేస్తున్నారంటారు. ఇక్కడ మనం తెలుసుకోవలసినవి ఏమిటంటే... మనవాడే కదా అని నిర్లక్ష్యం చేయరాదు. మర్యాదలు చేశారు కదా అని మొహమాటానికి పోయి దుర్మార్గుల పక్షం వహించరాదు. మనోబలం దెబ్బతింటే ఎంతటి వీరుడైనా బీరువు కావలసిందే! -
శల్యసారథ్యం చేయవద్దు!
భారతదేశంలో రాజై ఉండి సారథ్యం చేయవలసిన అవసరం లేనివాళ్లు ఇద్దరే. కృష్ణుడు, శల్యుడు. అయినా వాళ్లిద్దరూ సారథ్యం నేర్చుకున్నారు. అద్భుతంగా రథం నడిపేవారు. కృష్ణుడు సారథ్యం చేసినా పొగడ్తలకు లొంగలేదు. అందుకే పార్థసారథి బిరుదు వహించాడు. పార్థసారథికి దేవాలయం కూడా ఉంది. భారతం కూడా ఏమంటుందంటే యత్ర యోగీశ్వరః కృష్ణో, యత్రపార్థో ధనుర్ధరః తత్రశ్రీ ర్విజయో భూతిర్ ధ్రువా నీతి ర్మతిర్మమ ... ఎక్కడ కృష్ణుడు సారథిగా ఉన్నాడో, ఎక్కడ మనం రథిగా ఉన్నామో అక్కడ విజయం ఉంటుంది - అని. మరి శల్యుడో..! ఆయన కృష్ణుడి కన్నా తక్కువేం కాదు. తక్కెట్లో పెడితే సరి సమానంగా తూగుతారు. సారథ్యంలో అంత గొప్పవాడు శల్యుడు. పైగా పాండవులకు మేనమామ. కురుక్షేత్ర యుద్ధం వస్తున్నదని తెలుసుకుని పాండవులకు సాయం చేద్దామని బయల్దేరాడు. ఆయన రాజ్యం ఇప్పటి ఆప్ఘనిస్థాన్ ప్రాంతంలో ఎక్కడో ఉండేది. దుర్యోధనుడు ఇది గ్రహించాడు. శల్యుడు పొగడ్తలకు లొంగిపోయేవాడని తెలుసు. శల్యుడు వచ్చాడంటే పాండవుల పక్షం వహిస్తాడని-శల్యుడు పరివారంతో సహా వచ్చే మార్గమంతటా వారు సేదదీరడానికి చలువ పందిళ్లు వేయించాడు, పాటలు పెట్టించాడు, మధురాన్నాలు చేయించాడు... ఇలా చాలా ఏర్పాట్లు చేయించాడు. ఇవి ఎవరు చేయిస్తున్నారో శల్యుడికి తెలియదు. పాండవులే చేయిస్తున్నారనుకున్నాడు. ‘‘పాండవులు కనబడరేం’’ అన్నాడు. వెంటనే దుర్యోధనుడు వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ’’మీరు మహానుభావులు, మీలాంటి సారథి ఎక్కడ ఉన్నాడు కనుక, విలాస విద్య అంత గొప్పగా నేర్చుకున్నారు, మీలాంటి ఉత్తములు ఎక్కడ దొరుకుతారు. పాండవులకు మేనమామ అయితే నాకు కాదా? ఆ గౌరవంతోనే వచ్చాను. ఇవన్నీ చేయడం నా అదృష్టం’’ అంటూ ఆకాశానికెత్తేసాడు. పొంగిపోయాడు శల్యుడు. పాండవులకు సహాయం చేద్దామని బయల్దేరినవాడు ఈ పొగడ్తలకు లొంగిపోయి, ‘‘నీకేం కావాలో చెప్పు. ఇచ్చేస్తా’’ అన్నాడు. చటుక్కున దుర్యోధనుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, ’’మీరు మా పక్షాన ఉండండి’’ అనడిగాడు. ’’ఓ తప్పకుండా ఉంటాను’’ అన్నాడు. పొగిడాడు కదూ, మత్తు.. పరమ ప్రమాదకరమైన మత్తు. ‘‘తప్పకుండా వస్తా. మీ పక్షంలోనే ఉంటా’’ అని చెప్పాడు. దుర్యోధనుడు వెళ్లిపోయాడు. వెళ్లవలసింది పాండవుల ఇంటికి కదూ, శల్యుడు వెళ్లాడు అక్కడికి. ధర్మరాజు అంత కన్నా తెలివైనవాడు. అమిత వినయంగా ప్రవర్తించాడు. అన్నిటి కన్నా పైస్థానంలో కూర్చోబెట్టాడు. లోకంలో అన్నిటి కంటే ఎక్కువ మత్తెక్కించే మాట ఒకటుంది... ‘‘మీరు చెప్పకపోతే ఎవరు చెపుతారు సార్!’’ దానితో వాడికేం తెలియకపోయినా చెప్పడం మొదలెడతాడు నాలాగా. అందుకే ‘‘మీరు చెప్పండి. మేం వింటాం’’ అన్నారు పాండవులు. శల్యుడు చెప్పడం మొదలెట్టాడు. చాలానే చెప్పాడు. అవన్నీ తెలిసిన విషయాలే అయినా ఏమీ తెలియనివాళ్లలా పాండవులు విన్నారు. పొంగిపోయాడు. ఏం కావాలని అడిగాడు. ‘‘మిమ్మల్ని ఇబ్బందిపెట్టం. మీరు ఇప్పటికే కౌరవుల పక్షం వహిస్తానని చెప్పి మాటిచ్చారు కదా! అందుకే మీరు వారి పక్షంలోనే ఉండండి. కానీ మనసు మామీద పెట్టండి. మీ మేనల్లుడు పాండవుల్లో ఉన్నాడు. మేం గెలిచేటట్లు చూడండి. ఇది గుర్తు పెట్టుకోండి చాలు’’ అన్నారు. ‘‘ఓ తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను’’ అన్నాడు, శల్యుడు. మనసు పాండవుల దగ్గర, మనిషి కౌరవుల దగ్గర. యుద్ధానికి బయల్దేరాడు. నిజంగా మనసుపెట్టి చెయ్యగలడా? కర్ణుడికి సారథ్యం వహించమన్నాడు దుర్యోధనుడు. కోపమొచ్చింది శల్యుడికి. ఏమిటి, కర్ణుడికా, చెయ్యనుపోండి, అన్నాడు. మళ్ళీ పొగిడాడు దుర్యోధనుడు. తప్పకుండా చేస్తానన్నాడు. ఇక సారథ్యం వహిస్తూ ముందుకెడుతున్నాడు. కానీ మనసు పాండవుల మీద ఉంది. కర్ణుడితో ‘నువ్వు కాకివి’ అన్నాడు. పాండవులు హంసలాంటి వారన్నాడు. అర్జునుడితో యుద్ధం చేయడానికి నీకున్న అర్హతలేమిటన్నాడు, అర్జునుడి ముందు నీ శక్తి ఏ పాటిదన్నాడు. ఇలా తిడుతుంటే కర్ణుడు తెలిసిన అస్త్రాలు కూడా మర్చిపోయాడు. ఇదెక్కడి ప్రారబ్ధం, ఇదెక్కడి సారథ్యం అనుకున్నాడు కర్ణుడు. దీనినే శల్య సారథ్యం అంటారు. అంటే అటువంటివాడు మన పక్షంలో ఉన్నా ఎదుటి పక్షానికి ఉపకారం చేసి మన నాశనానికి కారణమౌతాడు. చివరకు కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు కూడా ఒకడయ్యాడు. ఎందుకొచ్చిందీ ప్రారబ్ధం శల్యుడికి? దుర్యోధనుడితో ముందే ‘‘నువ్వెన్ని చెప్పు. కావాలంటే నువ్వు చేసిన ఏర్పాట్ల ఖర్చంతా ఇచ్చేస్తాను. నేను ఎందుకు బయల్దేరానో, ఆ పని వదిలిపెట్టి ఇంకో పనిమీద రాను’’ అని తెగేసి చెప్పి ఉండొచ్చు. అలా అనగలిగాడా? పొగడ్తలకు లొంగిపోయాడు. అలా అనలేకపోయాడు. రెండు చోట్ల అదీ వైరిపక్షాల్లో మాటిచ్చాడు. ఏమయిపోయాడు? అందుకే మాటకు నిలబడడం రావాలి. పొగడ్తలను ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకోవాలి. అంతకన్నా ఎక్కువ పుచ్చుకున్నారనుకోండి. అది అలవాటు చేసుకుంటే పాడైపోతారు. ఇది శీలవైభవం. మీరు ఎక్కడ ఉన్నా శాంతిగా ఉండాలి. మీరు పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు సంతోషపడాలి, మీరు తల్లిగా ఉంటే మీ పిల్లలు ఆనందించాలి, మీరు క్లాస్‌రూమ్‌లో ఉంటే క్లాస్ టీచర్ సంతోషపడాలి, మీరు స్నేహితుడిగా ఉంటే మీ స్నేహితులందరూ సంతోషించాలి, మీరు భార్యగా ఉంటే మీ భర్త మిమ్మల్ని చూసి గర్వపడాలి...ఇలా మీరు ఏ స్థానంలో ఉంటే అది చూసి అవతలివారు పొంగిపోవాలి. అలా శీలవైభవాన్ని అందరూ అలవర్చుకున్ననాడు సమాజం సుభిక్షంగా ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
పంచమాంగ దళాలు
నానుడి ఆధునిక సైన్యాలలో త్రివిధ దళాలు ఉన్నట్లుగానే, ప్రాచీన సైన్యాలలో చతురంగ బలగాలు ఉండేవి. రథ, గజ, తురగ, పదాతి దళాలనే అప్పట్లో చతురంగ బలగాలు అనేవారు. యుద్ధాలు జరిగేటప్పుడు సైన్యంలో స్థాయీ భేదాలను అనుసరించి వీరాధి వీరుల్లో కొందరు రథాలను అధిరోహించేవారు. మరికొందరు ఏనుగులెక్కి యుద్ధాలు సాగించేవారు. ఇంకొందరు గుర్రాలెక్కి పోరు సల్పేవారు. సామాన్య సైనికులు ఎలాంటి వాహనం లేకుండానే యుద్ధరంగంలో నిలబడి శత్రువులను ఎదుర్కొనేవారు. చతురంగ బలసంపదతో ఎంతటి సేనావాహిని ఉన్నా, యుద్ధాలలో గెలుపు సాధించడం ఒక్కోసారి కష్టమయ్యేది. అలాంటప్పుడే రాజుల్లో కొందరు శత్రువర్గంలోని అసంతుష్టులను చేరదీసి, తమకు అనుకూలంగా తయారు చేసుకునేవారు. వాళ్ల ద్వారా గుట్టుమట్లు సేకరించి, అవలీలగా శత్రువులను మట్టికరిపించేవారు. ఒక్కోసారి అసంతుష్టుల్లో కొందరు తమంతట తామే శత్రు రాజులతో కుమ్మక్కయి, తమ రాజుల ఓటమికి కారకులయ్యేవారు. ఇలాంటి వాళ్లనే పంచమాంగ దళాలుగా అభివర్ణిస్తారు. రామాయణంలోని విభీషణుడు, మహాభారతంలోని శల్యుడు అలాంటి వాళ్లే.