న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ఆదివారం వేకువజామున ప్రమాదం చోటుచేసుకుంది. జ్యూరిచ్ బయలుదేరిన స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేసి, పెను విషాదాన్ని తప్పించారు.
ఇంజిన్‌లో మంటలు.. భయాందోళనలు
వివరాల్లోకి వెళితే.. స్విస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (LX147) 228 మంది ప్రయాణికులు, నలుగురు చిన్నారులతో జ్యూరిచ్ వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వేపై వేగం పుంజుకుంటున్న సమయంలో ఒక ఇంజిన్‌లో సమస్య ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. అదే సమయంలో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో, లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను పసిగట్టిన పైలట్లు వెంటనే టేకాఫ్ ప్రక్రియను నిలిపివేశారు.
ఎమర్జెన్సీ ప్రకటన.. ప్రయాణికుల తరలింపు
ఈ ఘటనతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు తక్షణమే ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేస్తూ, ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి తీవ్రమైన ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
యథావిధిగా విమాన సేవలు.. దర్యాప్తు షురూ
విమానాశ్రయం రన్‌వే 28/10 పై ఈ ప్రమాదం జరిగినప్పటికీ, ఎయిర్‌పోర్టులో ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఇంజిన్ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఈ అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు, బస ఏర్పాట్లను కల్పించేందుకు ఎయిర్‌లైన్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది.
ఇది కూడా చదవండి: ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ


