హైదరాబాద్‌లో సొంత ఇల్లా.. అద్దెనా? | census 2027 Will Start In Hyderabad Region | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సొంత ఇల్లా.. అద్దెనా?

Apr 26 2026 8:35 AM | Updated on Apr 26 2026 12:27 PM

census 2027 Will Start In Hyderabad Region
  • నేటి నుంచే సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌  

  • ప్రస్తుతం ఉంటున్న ఇంటి వివరాలే నమోదు చేయాలి

  • ఆధార్, ఇతరత్రా పత్రాలు అవసరం లేదు 

  • ‘క్యూర్‌’లోని 60 సర్కిళ్లు, కంటోన్మెంట్‌లో

  • 16 భాషల్లో సదుపాయం 

  • అందుబాటులో  https:// se. census. gov.in పోర్టల్‌ 

  • హెల్ప్‌లైన్‌ నంబర్‌: 1855

  • వివరాలు వెల్లడించిన భారతి హోళికేరి, ఆర్‌వీ కర్ణన్‌

సాక్షి, సిటీ బ్యూరో: జనగణన– 2027లో భాగంగా  కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌)లోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతోపాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌కు నేటి (ఆదివారం) నుంచి మే 10 వరకు అవకాశం ఉంది. ఈ గడువులో  https:// se. census. gov.in పోర్టల్‌ ద్వారా ప్రజలు  ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు తమ ఇంటి వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. జనగణనకు సంబంధించి సెన్సస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరి, ‘క్యూర్‌’ పరిధి  వరకు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 

33 ప్రశ్నలు.. 20 నిమిషాలు 
ఇందులో మొత్తం 33 పశ్ర్నలుండగా, నాలుగింటిని ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. మిగతావాటికి ప్రజలే సమాధానం ఇవ్వొచ్చు. గుడిసెలు సహా అన్ని నివాస భవనాలను నమోదు చేయడం అధికారుల ప్రధాన విధి. ప్రశ్నలన్నీ ఇల్లు, మౌలిక సదుపాయాలు, వాహనాలు తదితరాలకు సంబంధించినవి. వాటిని కూడా ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తే చాలు. అంతే తప్ప ఎన్ని వాహనాలున్నాయో తెలపాల్సిన పనిలేదు. కాకపోతే నివాస గృహం సొంతమా, అద్దెనా అన్నది తెలియజేయాలి. ఇక్కడ అద్దె ఇల్లు అయితే వేరే చోట సొంత ఇల్లు ఉందా అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియ మొత్తం దాదాపు 20 నిమిషాల్లో పూర్తవుతుందని వారు తెలిపారు.

సబ్మిట్‌ చేశాక ప్రత్యేక సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ఐడీ (ఎస్‌ఈ ఐడీ) జారీ అవుతుంది. ఈ ప్రక్రియలో ఆధార్‌ కానీ, ఇతరత్రా రుజువులు కానీ, ఫొటోలు కానీ అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులెవరైనా ఇంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయొచ్చు. సురక్షితమైన వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి నుంచి కానీ, కార్యాలయం నుంచి కానీ లేదా ఎక్కడి నుంచైనా వివరాలు  నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ ఇంటి వివరాలే ఇవ్వాలని తెలిపారు.  

నమోదు విధానం ఇలా..  
సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రారంభించడానికి  ముందు రాష్ట్రం పేరు, క్యాప్చా వంటివి నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్‌ నంబర్‌ ఇవ్వాలి. ఈమెయిల్‌ ఐడీ కూడా ఇవ్వవచ్చు. కుటుంబ యజమాని పేరు ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్చడం కుదరదు. ఒక మొబైల్‌ నంబర్‌ను ఒక ఇంటి వివరాల నమోదుకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేశాక, భాషను ఎంచుకోవచ్చు. 16 భాషల్లో సదుపాయం ఉంటుంది. తర్వాత జిల్లా, పిన్‌కోడ్, లొకాలిటీ, తదితర వివరాలతో తమ ఇంటిని మ్యాప్‌లో గుర్తించాలి. మ్యాప్‌లో కనిపించే మార్కర్‌ను తమ ఇంటిపైకి తీసుకెళ్లి లొకేషన్‌ కన్‌ఫర్మ్‌ చేయాల్సి ఉంటుంది. లొకేషన్‌ సరిగా గుర్తించకపోతే ఎన్యూమరేటర్‌కు డేటా అందకపోవచ్చు. నమోదు చేసిన వివరాలను సరి చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఒకేసారి కాకపోతే అప్పటి వరకు భర్తీచేసిన వివరాలను సేవ్‌ చేసుకొని తర్వాత భర్తీ చేసే సదుపాయం కూడా ఉంటుంది. అన్నీ సరిచేసి, నిర్ధారించుకుని సబ్మిట్‌ చేశాక మార్చడం కుదరదు. సబ్మిట్‌ తర్వాత  మొబైల్‌ నంబర్‌కు, మెయిల్‌ఐడీ ఇస్తే మెయిల్‌కు కూడా  హెచ్‌ అనే అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఎస్‌ఈ ఐడీ వస్తుంది. దాన్ని ఎన్యూమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తే పరిశీలించి ధువ్రీకరిస్తారు. ఈ డేటా గోప్యంగా ఉంటుందని, ఎవరికీ సమాచారం వెళ్లదని స్పష్టం చేశారు. వివరాలిస్తే ప్రజలు తమకు అందుతున్న సంక్షేమ పథకాలు అందకుండా పోతాయని భయపడాల్సిన పనిలేదన్నారు. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రజలకు సదుపాయమే తప్ప, తప్పనిసరి కాదు. సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకోకుంటే , ఎన్యూమరేటర్లే వివరాలు నమోదుచేస్తారు.  

గ్రేటర్‌లో సన్నాహాలు 
గేట్రర్‌లో 60 సర్కిళ్లు, కంటోన్మెంట్‌కు 61 మంది చార్జ్‌ ఆఫీసర్లను నియమించారు. 19,865 హౌస్‌లిస్టింగ్‌ బ్లాక్స్‌ను(హెచ్‌ఎల్‌బీ) గుర్తించి మార్కింగ్‌ పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. 21,866 మంది ఎన్యూమరేటర్లు, 3,662 సూపర్‌వైజర్లు అవసరమని గుర్తించారు. ఇప్పటి వరకు 8,067 ఎన్యూమరేటర్లకు, 1379 మంది సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. హెల్ప్‌లైన్‌ నంబర్‌: 1855. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు.

సెల్ఫ్‌ఎన్యూమరేషన్‌ మహోత్సవ్‌  
విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జీహెచ్‌ఎంసీ సెల్ఫ్‌ఎన్యూమరేషన్‌ మహోత్సవ్‌ పేరిట 15 రోజులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మెట్రో పిల్లర్లు, బస్సులు, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా కూడా పచ్రారం చేయనున్నట్లు కర్ణన్‌ పేర్కొన్నారు.  ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement