29న కోల్‌కతాలో బిగ్గెస్ట్‌ ఫైట్‌ | Mamata vs Suvendu in Bhabanipurs 2026 Showdown | Sakshi
Sakshi News home page

29న కోల్‌కతాలో బిగ్గెస్ట్‌ ఫైట్‌

Apr 26 2026 7:19 AM | Updated on Apr 26 2026 7:19 AM

Mamata vs Suvendu in Bhabanipurs 2026 Showdown

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సత్యజిత్ రే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో ఉద్దండులకు నిలయమైన కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ‘భవానీపూర్’ నియోజకవర్గం ఇప్పుడు మహా సంగ్రామానికి వేదికగా మారింది. 2026, ఏప్రిల్ 29న జరగనున్న ఈ హై-వోల్టేజ్ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మాజీ ప్రియ శిష్యుడు, ప్రస్తుత బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి మధ్య భీకర పోరు జరగనుంది. బెంగాల్ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ స్థానంలో గెలుపు ఇరు పార్టీలకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది.

చారిత్రక వారసత్వం.. ఉద్దండుల నిలయం
దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గానికి రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య పరంగా ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, దేశబంధు చిత్తరంజన్ దాస్, విద్యావేత్త అశుతోష్ ముఖర్జీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే, దిగ్గజ ఫిల్మ్ మేకర్స్ సత్యజిత్ రే, మృణాల్ సేన్, నటుడు ఉత్తమ్ కుమార్, గాయకుడు హేమంత్ కుమార్ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే నివసించారు. ఈ ప్రతిష్టాత్మక స్థానం ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకర పోరుకు సాక్ష్యంగా నిలవనుంది. కాళీఘాట్ ఆలయం, గురుద్వారాలు, మసీదులు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలతో కూడిన ఈ ప్రాంతం భిన్న సంస్కృతులకు సజీవ ప్రతీకగా నిలిచింది.

సొంత గడ్డపై ‘దీదీ’ వర్సెస్ ‘బయటి వ్యక్తి’
2011 నుంచి ఈ నియోజకవర్గాన్ని  కాపాడుకుంటూ వస్తున్న మమతా బెనర్జీ ఇక్కడి హరీష్ ఛటర్జీ వీధిలోనే నివసిస్తున్నారు. స్థానిక అశుతోష్ కళాశాలలో చదువుకున్న ఆమె కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు సుపరిచితురాలు. ప్రచారంలో భాగంగా ఆమె తనకు తెలిసిన పాత పరిచయస్థులను పలకరిస్తూ, వీధుల్లో కలియతిరుగుతున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి వచ్చిన సువేందు అధికారి ఈ పాత కోల్‌కతా ప్రాంతంలో ‘బయటి వ్యక్తి’ అనే ముద్రను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఇక్కడ ఆయన దీదీని ఓడిస్తే, రాష్ట్రంలో బీజేపీ వెతుకుతున్న తిరుగులేని నాయకునిగా ఆయన అవతరిస్తారు.

మమత ఓడిపోయే అవకాశం ఉందా?
ఈసారి ఎన్నికల వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు అంటున్నారు. ‘మమత ఇక్కడి నుంచి ఎప్పటికీ ఓడిపోరు. కానీ తొలిసారిగా నాన్-బెంగాలీ ప్రాంతాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బహిరంగ చర్చలు జరుగుతున్నాయి’ అని అదితి సర్కార్ అనే స్థానికురాలు అభిప్రాయపడ్డారు. అయితే మమత విద్యార్థి దశ నుంచి సాగిస్తున్న పోరాటాలను చూస్తున్నామని, ఆమె తమ ప్రాంతపు ఆడపడుచే అని స్థానిక కేఫ్ నిర్వాహకుడు అమోల్ సగర్వంగా చెబుతున్నారు. ఎవరి ధీమా వారికున్నా.. ఉత్కంఠ మాత్రం తారాస్థాయికి చేరుకుంది.

కీలక సమస్యలు.. వ్యాపారుల ఆందోళన
సరిహద్దు చొరబాట్లు, ఆర్‌జీ కర్ ఉదంతం, రాష్ట్ర ఆర్థిక మందగమనం లాంటివి ఈ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా మారాయి. 1953లో కచ్ నుంచి వలస వచ్చిన వ్యాపారి భరత్ మెహతా మాట్లాడుతూ.. ‘భవానీపూర్‌లో గెలవడం మమతకు ప్రతిష్టాత్మక సమస్య. సువేందు ఇక్కడ పోటీ చేసి తప్పు చేశారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల మమత మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఆర్థిక మందగమనం వల్ల బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌లకు ఇప్పటికే చాలా మంది వ్యాపారులు వలస వెళ్లిపోతున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికత వర్సెస్ వలసదారుల విభజన
ఈ ఎన్నికల్లో బెంగాలీ, నాన్-బెంగాలీ విభజన స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలకు బెంగాల్ సురక్షితమైన ప్రాంతమని యువ ఓటరు, బ్యాంకర్ కరబి ఘోష్ బలంగా విశ్వసిస్తున్నారు. మమతా దీదీ తమకు ఎంతో సాయం చేశారని, తమ గురుద్వారాను సైతం సందర్శించారని ట్యాక్సీ డ్రైవర్ సుఖ్విందర్ సింగ్ కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. కానీ బీహార్‌కు చెందిన మరో ట్యాక్సీ డ్రైవర్ రతన్ కుమార్ మాత్రం.. ‘మేము గతంలో తృణమూల్‌కే ఓటేశాం, కానీ ఈసారి ప్రజలు ‘పరివర్తన్’ (మార్పు) కోరుకుంటున్నారు’ అని  అన్నారు.

ఎన్నికల జ్వరంతో నిద్రలేని రాత్రులు
పోలింగ్‌కు  కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో భవానీపూర్ వీధులన్నీ రాజకీయ వేడితో  మరింత హీటెక్కిపోతున్నాయి. పగటి ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు టీఎంసీ, బీజేపీ నాయకులు రాత్రి వేళల్లో  సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాషాయ జెండాలతో సువేందు వర్గం, తమదైన శైలిలో దీదీ వర్గం ప్రచారాలు హోరెత్తిస్తుండటంతో ఈ ప్రాంతమంతా అర్ధరాత్రి వరకు కోలాహలంగా ఉంటోంది.

ఇది  కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే?

Advertisement
 
Advertisement
Advertisement