కాన్పూర్‌లో ఒక 24 ఏళ్ల యువ న్యాయవాది తన తండ్రి వేధింపుల కారణంగా కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, తల్లితండ్రుల ప్రవర్తన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ ఘటన ప్రతిబింబిస్తోంది. సూసైడ్ నోట్‌లో అతను పేర్కొన్న విషయాలు చూసి పోలీసులే షాకయ్యారు. హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రియాంషు శ్రీవాస్తవ అనే యువ న్యాయవాది కాన్పూర్ కోర్టు భవనం ఐదవ అంతస్తు నుండి దూకేశాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆయనను హుటా హుటిన ఉర్సులా హార్స్‌మన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
బాల్యంలో చేదు అనుభవాలు వారి మనసుపై చెరగని ముద్ర వేస్తాయి, తద్వారా అపరాధ భావం, న్యూనతా భావం, ఒత్తిడి పెరిగిపోతాయని మనస్తత్వ నిపుణులు చెపుతారు. తన తండ్రి చిన్నతనం నుండి తనను ఎలా మానసిక వేదనకు గురిచేశారో వివరిస్తూ ఆత్మహత్యకు ముందు ప్రియాంషు తన వాట్సాప్ స్టేటస్‌లో రెండు పేజీల సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశాడు. శ్రీవాస్తవ తాను రాసిన రెండు పేజీల సూసైడ్ నోట్‌లో, తన బాల్యం , కౌమార దశలో తన తండ్రి తనను మానసికంగా వేధించిన వైనాన్ని వివరించాడు. పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్న తండ్రి వల్ల మానసిక ఒత్తిడిని కూడా ప్రస్తావించాడు.
మ్యాంగో జ్యూస్ తాగినందుకు శిక్ష
ప్రియాంషుకు 6 ఏళ్ల వయసున్నప్పుడు, ఫ్రిజ్‌లో ఉన్న మామిడి జ్యూస్‌ను అనుమతి లేకుండా తాగినందుకు తండ్రి ఆయన బట్టలు విప్పదీసి ఇంటి నుండి బయటకు గెంటివేశారని పేర్కొన్నాడు. ఈ ఘటన తనను చాలా బాధించిందని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: అంత్యక్రియల్లోబార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!
2016లో 9వ తరగతిలో ఉన్నప్పుడు ప్రియాంషు 'ఫిజికల్ ఎడ్యుకేషన్' తీసుకోవాలని అనుకున్నప్పటికీ తండ్రి బలవంతం చేసి 'కంప్యూటర్' సబ్జెక్టు తీసుకోవాలని ఒత్తిడి చేశారని, మాట వినకపోతే పాత శిక్షలే వేస్తానని బెదిరించారని నోట్‌లో రాశాడు.
తండ్రిపై ఆగ్రహం
తండ్రి ప్రవర్తన ప్రియాంషు మనసుని చిన్నాభిన్నం చేసింది. అందుకే తన తండ్రి లాంటి వ్యక్తి ఎవరికీ వద్దు దేవుడా అని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు తన మరణం తర్వాత తండ్రి, తన దేహాన్ని తాకడానికి వీల్లేదని కోరుకున్నాడు. అలాగే తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యులను చేయవద్దని కోరుతూనే, తన మరణం తర్వాత తన తల్లిని వేధించవద్దని వేడుకున్నాడు.
ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!
పోలీసుల దర్యాప్తు
మృతుడి ఆత్మహత్య లేఖలోని విషయాలను పరిశీలిస్తున్నామని పోలీసు కమిషనర్ రఘుబీర్ లాల్. కోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజీని కూడా సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపామని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్


