అంత్యక్రియల్లో బార్‌ గర్ల్స్‌ డ్యాన్స్‌.. అసలు విషయం ఇదీ! | Dancers Thailand get hired by family to dance at mans funeral | Sakshi
Sakshi News home page

అంత్యక్రియల్లోబార్‌ గర్ల్స్‌ డ్యాన్స్‌.. అసలు విషయం ఇదీ!

Apr 25 2026 11:30 AM | Updated on Apr 25 2026 12:10 PM

Dancers Thailand get hired by family to dance at mans funeral

థాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక మనిషి చివరి కోరిక తీర్చడం, కనీసధర్మంగా పాటించడం ఆనవాయితీ. అలా వారి ఆత్మశాంతిస్తుందని కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢంగా నమ్ముతారు. కానీ అలా చేసినందుకు ఒక థాయ్ కుటుంబం విమర్శల పాలైంది. అసలింతకీ ఏమైంది? అతని చివరి కోరిక ఏంటి?

బ్యాంకాక్ పోస్ట్ నివేదిక ప్రకారం,దక్షిణ థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి తమ్మారత్ ప్రావిన్స్‌లో ఉన్న వాట్ థెప్పనోమ్ చుయట్ అనే బౌద్ధ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 15న మరణించిన 59 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియలను ఏప్రిల్ 21న నిర్వహించారు. అయితే అతని  దహన సంస్కారాలకు ముందు ప్రదర్శన ఇవ్వడానికి 'కొయెట్ డాన్సర్స్' గా పిలిచే ముగ్గురు మహిళా నృత్యకారులను ఏర్పాటు చేసింది. (అతి తక్కువ బట్టలతో నృత్యం చేస్తారు. సాధారణంగా బార్ టేబుళ్ల మీద, నైట్‌క్లబ్‌లలో లేదా ఇతర కార్యక్రమాలలో నృత్యం చేస్తారు) దీనికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

ఏం జరిగింది?
బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత, చితికి నిప్పంటించే ముందు ఈ నృత్య ప్రదర్శన జరిగింది. ముగ్గురు యువతులు శవపేటిక ముందు నిలబడి డ్యాన్స్ చేశారు. అన్ని వయసుల వారు ఈ ప్రదర్శనను చూస్తుండగా, దీనిని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
బాధపడుతూ కూర్చోవడం కంటే, మరణించిన వారి ఆఖరి కోరికను గౌరవించడం మంచిదే. దీనివల్ల విషాదం కొంతవరకు తగ్గుతుందని కొందరు  సదరు కుటుంబానికి మద్దతుగా నిలిచారు.  మరోవైపు మరణించిన వారి కోరికను గౌరవించాల్సిందే, కానీ అంత్యక్రియల వంటి పవిత్రమైన చోట ఇలాంటి నృత్యాలు సరికావు. ముఖ్యంగా చిన్న పిల్లల ముందు ఇలాంటి ప్రదర్శనలు భ్యంతరకరమని మరికొందరు విమర్శించారు. మొత్తానికి, సంప్రదాయానికి, వ్యక్తిగత కోరికకు మధ్య జరుగుతున్న ఈ వివాదం థాయ్‌లాండ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కుటుంబ సభ్యుల వివరణ
నెటిజన్ల విమర్శల నేపథ్యంలో మృతుడి కుటుంబం వివరణ ఇచ్చింది. "చావు అనేది అనివార్యం, నా అంత్యక్రియల సమయంలో ఎవరూ ఏడవకూడదు, వేడుకలా జరుపు కోవాలి" అనేది అతని  చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చడం తమ కనీస బాధ్యఅని భావించామని తెలిపారు. అతను జీవించి ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా, జోవియల్‌గా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చడానికి మరియు శోకతప్త హృదయాల్లో ఆనందాన్ని నింపడానికే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement