చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం! | Gujarat man fights off leopard with bare hands to save daughter | Sakshi
Sakshi News home page

చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!

Apr 25 2026 2:58 PM | Updated on Apr 25 2026 3:10 PM

Gujarat man fights off leopard with bare hands to save daughter

గుజరాత్‌లోని ఛోటా ఉదయ్‌పూర్‌లో  నాలుగేళ్ల  కుమార్తె కోసం ప్రాణాలకు తెగించి మరీ ఒక తండ్రి చేసిన  పోరాటం ప్రశంసలు దక్కించుకుంటోంది. అసాధారణ ధైర్యం ప్రదర్శించి, ఒట్టి చేతులతో చిరుతతో పెనుగులాడి కుమార్తెను మృత్యు ముఖం నుంచి కాపాడుకున్నాడు. 

ఈ సంఘటన ఛోటా ఉదయ్‌పూర్ జిల్లాలోని ఒక చిన్న బుధవారం సాయంత్రం పావి జెట్‌పూర్ తాలూకాలోని రస్లీ గ్రామంలో జరిగింది. తల్లి దగ్గర్లో పని చేస్తుండగా, ఆ బాలిక ఇంటి పెరట్లో ఆడుకుంటోంది.  సాయంత్రం వేళ, మసకబారుతున్న వెలుతురులో, ఒక చిరుత మెల్లగా వచ్చి అకస్మాత్తుగా చిన్నారిపై ఎటాక్‌ చేసింది. ఇది చూసిన తల్లి భయంతో కేకలు వేసింది.  దీంతో ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తుకొచ్చిన తండ్రి సురేష్ రత్వా చిరుత నోట కరుచుని తన బిడ్డను లాక్కెళ్లుతుండడాన్ని చూశాడు. భయంతో క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు. కానీ వెంటనే ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. చిరుతపులి వైపు పరుగెత్తి, కేవలం ఒట్టి చేతులతోనే పోరాడాడు. ఎలాంటి ఆయుధం లేదు. భయం  అంతకన్నా లేదు. చిరుతపై  ఎగబడ్డాడు. బాలికను పట్టుకుని, మరో చేతితో దాని శరీరంపై పదేపదే పిడిగుద్దులు కురిపించాడు. దాని  దవడలు విరిచాడు. చివరికి, చిరుత తన పట్టును సడలించి, బాలికను వదిలిపెట్టి, రత్వా ఇంటి వెనుక ఉన్న పొలాల్లోకి పారిపోయింది.  అలా అత్యంత సాహసంగా తన నాలుగేళ్ల కుమార్తెను మృత్యుముఖం నుండి రక్షించాడు. బాలిక ముఖం, మెడపై తీవ్ర గాయాలయ్యాయని, అయితే స్థానిక ఆసుపత్రిలో ఆమె చికిత్సకు బాగా స్పందిస్తోందని అధికారులు తెలిపారు. 

దీనిపై  పావి జెట్‌పూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయదీప్ సోలంకి   స్పందిస్తూ  రత్వా పోరాటాన్ని వివరించారు. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో, చిరుత వెనక్కి తగ్గలేదు. రత్వాను పదేపదే గోళ్లతో రక్కింది. అయినా రత్వా పట్టు వీడలేదు.. మరో చేత్తో తన కుమార్తెను గట్టిగా పట్టుకుని, చిరుత పారపోయిందాకా పోరాడాడు అని తెలిపారు.  

ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో గ్రామస్తులు చిరుతలను చూశారు, కానీ మనిషిపై దాడి జరగడం ఇదే మొదటిసారని సోలంకి చెప్పారు.ఆహారం కోసం సమీపంలోని నదీ లోయ నుండి గ్రామంలోకి దారితప్పి వచ్చి ఉండవచ్చన్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత చిరుత మళ్లీ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాని జాడ పట్టుకుని, బంధించడానికి గ్రామం చుట్టూ ట్రాప్ కెమెరాలతో పాటు మూడు బోనులను ఏర్పాటు చేశారు.

నాన్న అంటే అంతే... నెటిజన్లు ప్రశంసలు

తండ్రి అంటే అంతే..ఇలాగే ఉంటాడు. తన కుటుంబం, పిల్లలు కాపాడుకునే విషయంలో క్రూరంగా మారిపోతాడు, ఎదురుగా ఎవరున్నా లెక్కచేయడు అంటూ అతనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement