వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఒక్కసారిగా తుపాకీ మోతలు దద్దరిల్లాయి. వందలాది మంది ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటన నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ప్రముఖులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్ హౌస్‌లో ప్రసంగించారు. ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వెలుపల చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై డోనాల్డ్ ట్రంప్, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొనగా, ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమైనట్లు కాష్ పటేల్ ధృవీకరించారు. అయితే, నిందితుడి వద్ద ఉన్న ఆయుధాల గురించి మరిన్ని ఇతర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవన్నారు.
ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తాను ఎంతో పదునైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తదుపరి కార్యక్రమంలో తన ప్రసంగం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. తాను ప్రసంగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నానని, కానీ భద్రతా కారణాల దృష్ట్యా వచ్చేసారి చాలా సాదాసీదాగా వ్యవహరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికపైనే ఉండాలని తాను గట్టిగా ప్రయత్నించానని, కానీ భద్రతా బలగాల సూచన మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ట్రంప్ వివరించారు. ఈ కాల్పుల ఘటన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించిన తీరును అభినందించిన ట్రంప్.. ‘సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా స్పందించింది... ఒక వ్యక్తి అనేక ఆయుధాలతో భద్రతా తనిఖీ కేంద్రం వైపు దూసుకువచ్చాడు.. అతడిని సీక్రెట్ సర్వీస్‌కు చెందిన కొందరు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పారదర్శకత, స్పష్టత కోసం, నేను విడుదల చేయమని ఆదేశించిన ఒక టేప్‌ను ఇప్పుడే అధికారులు విడుదల చేశారు... మన రాజ్యాంగంపై దాడి చేసిన ఈ దుండగుడి హింసాకాండను, అలాగే మన దేశం తరపున సీక్రెట్ సర్వీస్, చట్ట అమలు సంస్థలు ఎంత వేగంగా స్పందించాయో ఆ టేప్ తెలియజేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఎవరూ మన సమాజాన్ని హస్తగతం చేసుకోవడానికి వీల్లేదని, ఇలాంటి ఘటనల వల్ల కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.


