‘గంగ’ చుట్టూ బెంగాల్‌ రాజకీయం.. | West Bengal Politics Around With Ganga River | Sakshi
Sakshi News home page

‘గంగ’ చుట్టూ బెంగాల్‌ రాజకీయం..

Apr 26 2026 7:47 AM | Updated on Apr 26 2026 7:47 AM

West Bengal Politics Around With Ganga River

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న వేళ పవిత్ర గంగా నది చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కాలుష్యమయంగా మారిన గంగా నది శుద్ధి, పరీవాహక ప్రాంత ప్రజల జీవనోపాధి, మత్స్యకారుల సమస్యలు, పెరుగుతున్న భూక్షయం వంటి అంశాలు పార్టీలకు రాజకీయ అ్రస్తాలుగా మారుతున్నాయి.

బెంగాల్‌లో ముఖ్యమైన నది అయిన గంగ ఉత్తర నుండి దక్షిణం వరకు సుమారు 520 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 7 జిల్లాల్లోని సుమారు 90 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నది ప్రవహిస్తోంది. తీర ప్రాంతాల్లో 2.80 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నట్లు అంచనా. రెండో దశలో ఎన్నికలు జరుగనున్న ముర్షిదాబాద్, నాదియా, మాల్దా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో గంగా నది ప్రక్షాళన అంశమే ప్రచారాస్త్రంగా మారింది.  
 
తృణమూల్‌దే హవా  
ప్రతి ఏటా వర్షాకాలంలో గంగా నదికి భారీ వస్తోంది. తీర ప్రాంతాల్లో 8,000–10,000 హెక్టార్ల భూమి కోతకు గురై భూక్షయానికి కారణమవుతోంది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. పంటలు, ఇళ్లు నష్టపోతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. అధిక వర్షాల సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా లేకుండా పోతోంది. దీనికి తోడు పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యం వల్ల తాగునీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి.

అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, గంగా నదిని పరిశుభ్రంగా మారుస్తామని ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గంగా పరీవాహక ప్రాంతాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. 2016, 2021 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 80 శాతానికి పైగా సీట్లు గెల్చుకుంది. 2026 ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని తృణమూల్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తన పట్టు పెంచుకొనేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గంగా నదిపై ఆధారపడిన ఓటర్ల మనసులు గెల్చుకుంటే విజయం తథ్యమని ప్రధాన పార్టీలు నిర్ణయానికొచ్చాయి. ఆ దిశగానే వ్యూహాలు అమలు చేస్తున్నాయి.  

పోటాపోటీ విమర్శలు
గంగా నది చుట్టూ పెనవేసుకున్న సమస్యల పరిష్కారం కోసం తీర రక్షణ గోడల నిర్మాణం, వరద నియంత్రణ ప్రాజెక్టులు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, గంగా శుద్ధి ప్రణాళికలు వంటివి ప్రతిసారీ రాజకీయ హామీలుగా తెరపైకి వస్తున్నాయి. గంగా నది వరద నియంత్రణకు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశామని, మరో రూ.100 కోట్లు మంజూరు చేశామని ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వరద ప్రభావిత కుటుంబాలకు రూ.1,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. గంగా నది శుద్ధికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగా బెంగాల్‌కు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయినప్పటికీ నది ప్రక్షాళనకు రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై సైతం ఎన్నికల ప్రచారంలో గంగా నదిపై దృష్టి పెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ‘‘బీహార్‌ తర్వాత గంగా నది పశ్చిమ బెంగాల్‌ను శుభ్రం చేస్తుంది’’అని వ్యాఖ్యానించారు. బీహార్‌లో పాగా వేశామని, ఇకపై బెంగాలో జెండా ఎగురవేయబోతున్నామని పరోక్షంగా తేల్చిచెప్పారు. నమామి గంగే కార్యక్రమం ద్వారా గంగా శుద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా సహకరించడం లేదని, అందుకే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

నది ప్రక్షాళన కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని బెంగాల్‌ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే స్వచ్ఛమైన నది సాకారమవుతుందని ఎన్నికల ప్రచారంలో తేల్చి చెబుతున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ఆయన గంగా నదిలో పడవపై విహరించారు. ఈ విహారాన్ని సైతం సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ప్రధానమంత్రి ఢిల్లీలోని యమునా నదికి వెళ్లి స్నానం చేస్తారా? అక్కడ నదిలో ప్రయాణించే సాహసం చేయగలరా? అని సవాల్‌ విసిరారు. మొత్తానికి గంగా నది వ్యవహారం అధికార, విపక్షాలకు ప్రచార ఆయుధంగా మారిపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement