కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. మహిళల భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మే 5 తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాత్రి ఒంటిగంట దాటినా ఆడపిల్లలు ఎలాంటి భయం లేకుండా వీధుల్లో తిరగగలరని ఆయన భరోసా ఇచ్చారు.
మహిళల భద్రతపై దీదీకి సూటి ప్రశ్నలు
గత పదిహేనేళ్ల మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రంలోని తల్లులు, సోదరీమణులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అమిత్ షా ఆరోపించారు. ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ, కలకత్తా లా కాలేజ్ వంటి ఘటనలే ఇందుకు సజీవ సాక్ష్యాలన్నారు. ‘రాత్రి 7 గంటల తర్వాత మహిళలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని దీదీ చెబుతున్నారు. దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రీ ఇలాంటి మాట అనలేదు. ఒక మహిళ.. సీఎంగా ఉండి కూడా భద్రత కల్పించలేకపోయినందుకు సిగ్గుపడాలి. మే 5న మేం అధికారంలోకి వచ్చాక ఏ రౌడీ కూడా మహిళల వైపు కన్నెత్తి చూడలేడు, అలాంటి వారిని కటకటాల వెనక్కి నెడతాం’ అని జమాల్‌పూర్ ర్యాలీలో అమిత్ షా హెచ్చరించారు.
जमालपुर वासी भी भाजपा सरकार बना रहे हैं...
ভোটের প্রথম দফাতেই ১১০টি আসনে জয়লাভ করে বিজেপি পশ্চিমবঙ্গে সরকার গঠনের পথে অনেকটাই এগিয়ে গিয়েছে। জামালপুর বিধানসভার বাসিন্দারাও তৃণমূল কংগ্রেসকে সম্পূর্ণভাবে পরাজিত করার জন্য প্রস্তুত।#BanglarHridoyeBJP https://t.co/E5l9lC5GPy— Amit Shah (@AmitShah) April 25, 2026
తొలి దశలో 110కి పైగా స్థానాలు మావే
మొదటి దశ పోలింగ్ సరళిని బట్టి బీజేపీకి తిరుగులేని విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. 152 స్థానాలకు గాను 110కి పైగా సీట్లను కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. 16 జిల్లాల్లోని 52 స్థానాల్లో ఏకంగా 92.98 శాతం పోలింగ్ నమోదు కావడమే మమతా సర్కార్ పతనానికి సంకేతమన్నారు. బెంగాల్ ప్రజల్లో భయం పోయిందని, బీజేపీ పట్ల నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ పూర్తయ్యే సరికి బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మతువా సామాజిక వర్గానికి ‘సీఏఏ’ రక్షణ కవచం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని షా విమర్శించారు. అయితే బీజేపీ అధికారంలోకి రాగానే సీఏఏను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మూలాలున్న మతువా సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: 29న కోల్‌కతాలో బిగ్గెస్ట్ ఫైట్


