కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈ ఎన్నికలు కేవలం బెంగాల్‌కే కాకుండా యావత్ భారతదేశ భవిష్యత్తుకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. చొరబాటుదారుల ముప్పును అరికట్టకపోతే తూర్పు భారతదేశ రూపురేఖలే మారిపోతాయని హెచ్చరిస్తూ.. ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయాలపై మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
200 సీట్లతో బీజేపీ సునామీ
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తున్నదని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. తొలి విడత పోలింగ్‌లో బీజేపీకి వచ్చిన మద్దతుతో రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, బీజేపీ 200కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో వీస్తున్న గాలిని ‘బీజేపీ సునామీ’గా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో మార్పు తథ్యమని అన్నారు.
పెను ముప్పు
టీఎంసీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బంగ్లాదేశ్ చొరబాటుదారులను ప్రోత్సహిస్తోందని సీఎం హిమంత మండిపడ్డారు. సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్ (బీఎస్‌ఎఫ్)దళాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చొరబాట్లను అడ్డుకోకపోతే భవిష్యత్తులో దేశంలోని తూర్పు ప్రాంతమంతా బంగ్లాదేశ్‌లో కలిసిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదంలో హిందువుల జనాభా
అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న జనాభా సమీకరణలపై శర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అసోంలో 60 శాతం హిందువులు, 40 శాతం ముస్లింలు ఉన్నారని.. రాబోయే రెండు దశాబ్దాల్లో అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రభావం బీహార్, జార్ఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాలన్నింటిపై పడుతుందన్నారు. కాగా బెంగాల్‌లో ఏప్రిల్ 23న బెంగాల్ తొలి దశ పోలింగ్ ముగియగా, ఏప్రిల్ 29న రెండో దశ జరగనుంది. ఫలితాలు మే 4న వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: గేటుకి వేలాడిన గజదొంగ.. గ్రేట్ ఎస్కేప్ ఫెయిల్!


