ఘజియాబాద్: ఆ దొంగ ఒక ఇంట్లో చోరీ చేద్దామని ఎంతో పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. అయితే కీలక సమయంలో అతగాడి ప్లాన్ దారుణంగా బెడిసికొట్టింది! ఇల్లు దోచుకోవడం పక్కనపెడితే.. కనీసం అక్కడి నుంచి ప్రాణాలతో పారిపోలేక, గేటుకే వేలాడుతూ అందరిముందూ నవ్వులపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాకుండా, ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
దొంగతనం చేద్దామని వెళ్లి..
ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని ఓ దొంగ గమనించాడు. ఆ ఇంటిలోనికి చొరబడి అయినకాడికి దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. గోడకు, గేటుకు మధ్య ఉన్న ఇనుప గ్రిల్స్ సందులో నుంచి అతికష్టం మీద ఇంటి లోపలికి దూరాడు. కానీ, అప్పటికే వీధిలో ఎవరో నడుస్తున్న అలికిడి వినిపించడంతో భయపడిపోయాడు. ఎవరైనా చూస్తారనే కంగారులో, తాను వచ్చిన సందులో నుంచే వెంటనే పారిపోవాలని భావించాడు.
గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి..
ఎంత వేగంగా బయట పడాలని ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. ఆ ఇనుప కడ్డీల మధ్యలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం బయటకు, ఇంకో సగం లోపల ఉండిపోయి గేటుపైనే ఇబ్బంది పడుతూ ఉండిపోయాడు. ఈ వింత దృశ్యాన్ని చూసిన స్థానికులు గుమిగూడి, ఆ తతంగాన్ని తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. కిందకు దిగమని అడుగుతున్నా అతను రాలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.
అసలు ట్విస్ట్ ఏంటంటే..
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీసుకువచ్చి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదని, ఇంటి యజమానులు కూడా ఫిర్యాదు చేయడానికి నిరాకరించారని అధికారులు తెలిపారు. పైగా ఆ కుర్రాడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. నెటిజన్లు మాత్రం ‘ఉద్యోగం’లో మొదటి రోజే ఇలా ఇరుక్కున్నాడేంటి? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురకలు


