కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురకలు | Hazare Blames Leadership as 7 MPs Join BJP | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు అన్నా హజారే చురకలు

Apr 25 2026 12:39 PM | Updated on Apr 25 2026 12:44 PM

Hazare Blames Leadership as 7 MPs Join BJP

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కనీవినీ ఎరుగని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కీలక నేత రాఘవ్ చద్దాతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి కమలం గూటికి చేరడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ ఇప్పుడు కుప్పకూలడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రస్థాయిలో స్పందించారు.

నాయకత్వానిదే తప్పు..
మహారాష్ట్రలోని అహిల్యనగర్‌లో అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. ఆప్ ప్రస్తుత దుస్థితికి పార్టీ అధిష్ఠానానిదే పూర్తి బాధ్యత అని  అన్నారు. పార్టీ సరైన మార్గంలో పయనించి ఉంటే, ఎంపీలు ఈ స్థాయిలో బయటకు వెళ్లేవారు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉండాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, కానీ పార్టీలో అంతర్గతంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చని ఆయన విశ్లేషించారు. వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి ఆప్ పక్కకు తప్పుకుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఆప్‌కు రాఘవ్ చద్దా గుడ్‌బై
ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం ఆప్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలీవాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నిలు ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఇప్పుడు విలువలు, నైతికతను పూర్తిగా గాలికి వదిలేసిందని చద్దా ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో అవినీతికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించిన ఆప్, ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. రాజ్యసభలో రాఘవ్ చద్దాను ఉపనేత పదవి నుంచి తప్పించి అశోక్ మిట్టల్‌కు ఆ బాధ్యతలు అప్పగించడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికి, పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు గొడ్డలిపెట్టుగా మారాయి. 

ఇది కూడా చదవండి: బైక్ బ్యాన్ అంశం: ఈసీకి హైకోర్టు షాక్!

Advertisement
 
Advertisement
Advertisement