కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘానికి (ఈసీ) కలకత్తా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. స్వేచ్ఛాయుత ఎన్నికల పేరుతో సామాన్యుల రాకపోకలపై ఆంక్షలు విధించడం సరికాదంటూ, 48 గంటల బైక్ బ్యాన్‌ను కోర్టు కొట్టివేసింది. అధికారాల పేరుతో హేతుబద్ధత లేని నిషేధాలు వద్దని స్పష్టం చేస్తూనే, ఓటర్లు, ద్విచక్ర వాహనదారులకు ఈ తీర్పుతో కోర్టు భారీ ఊరటను కల్పించింది.
ఈసీ ఆంక్షలకు బ్రేక్
ఏప్రిల్ 29న జరగనున్న రెండవ దశ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఈసీ విధించిన 48 గంటల పూర్తి నిషేధాన్ని జస్టిస్ కృష్ణారావు ధర్మాసనం తప్పుబట్టింది. ఇలాంటి కఠినమైన ఆంక్షలు ఏమాత్రం సమర్థనీయం కాదని 11 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. అయితే, ఎన్నికలకు 48 గంటల ముందు నుంచి ద్విచక్ర వాహనాలతో నిర్వహించే బైక్ ర్యాలీలపై ఉన్న నిషేధం మాత్రం కొనసాగుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించడానికి ఇది అవసరమని కోర్టు అంగీకరించింది.
పోలింగ్ రోజున 12 గంటలు మాత్రమే..
పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేవలం 12 గంటల పాటు ద్విచక్ర వాహనం వెనుక సీటుపై (పిలియన్ రైడింగ్) ప్రయాణించడంపై పరిమిత ఆంక్షలకు మాత్రమే హైకోర్టు అనుమతించింది. ఓటు వేయడానికి, వైద్య అత్యవసర పరిస్థితులకు లేదా కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే కుటుంబ సభ్యులు మాత్రమే బైక్ వెనుక సీటుపై కూర్చోవడానికి మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలకు ఓటింగ్ రోజున రవాణా ఇబ్బందులు చాలా వరకు తప్పనున్నాయి.
డెలివరీ బాయ్స్, ఉద్యోగులకు మినహాయింపు
ఓలా, ఉబెర్, జొమాటో, స్విగ్గీ లాంటి సర్వీస్ ప్రొవైడర్లు, హోమ్ డెలివరీ ఏజెన్సీలతో పాటు సరైన గుర్తింపు కార్డు ఉన్న ఉద్యోగులకు ఈ ఆంక్షల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుందని కోర్టు తెలిపింది. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉన్నప్పటికీ, అది చట్టాలకు లోబడే ఉండాలని, పరిమితులు దాటకూడదని హైకోర్టు సున్నితంగా మందలించింది. ఇప్పటికే పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నందున, ప్రజలందరిపై ఇలాంటి భారీ నిషేధాలు విధించాల్సిన అవసరం ఏమాత్రం లేదని తేల్చిచెప్పింది.
ఇది కూడా చదవండి: రీపోలింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన


