జోహన్నెస్‌బర్గ్‌లో మారణహోమం.. 12 మంది మృతి | Johannesburg Mass Shooting 12 Killed | Sakshi
Sakshi News home page

జోహన్నెస్‌బర్గ్‌లో మారణహోమం.. 12 మంది మృతి

Jun 10 2026 11:52 AM | Updated on Jun 10 2026 12:12 PM

Johannesburg Mass Shooting 12 Killed

జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో మంగళవారం అర్ధరాత్రి వేళ కాల్పుల కలకలం చేటుచేసుకుంది. ఈస్ట్‌ జోహన్నెస్‌బర్గ్‌లోని క్లీవ్‌ల్యాండ్‌ పరిధిలో ఉన్న జంపర్స్ ఇన్‌ఫార్మల్ సెటిల్‌మెంట్‌పై గుర్తు తెలియని దుండగులు మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ దారుణ సాయుధ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:10 గంటల సమయంలో ఈ కాల్పులు  జరిగినట్లు సౌత్ ఆఫ్రికన్ పోలీస్ సర్వీస్ బుధవారం తెలిపింది.

అర్ధరాత్రి వేళ మారణకాండ
జంపర్స్ సెటిల్‌మెంట్‌లో కాల్పులు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే అక్కడ  ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతడు మరణించాడు. గాయపడిన మరో తొమ్మిది మంది బాధితులకు ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.

పక్కా స్కెచ్‌తో విరుచుకుపడ్డ దుండగులు
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు పక్కా ప్లాన్‌తో వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒక తెల్లటి టయోటా క్వాంటం వాహనంలో 10 మందికి పైగా సాయుధ దుండగులు క్లీవ్‌ల్యాండ్‌లోని పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకున్నారు. అనంతరం వారు ఆ ఇన్‌ఫార్మల్ సెటిల్‌మెంట్‌కు ఉన్న రెండు ప్రవేశ మార్గాల గుండా లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న స్థానికులపై ఏకపక్షంగా, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. అనంతరం అదే వాహనంలో అక్కడి నుండి పరారయ్యారు.

ముమ్మరంగా సాగుతున్న గాలింపు చర్యలు
ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుల లక్ష్యం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాగా, ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటిగా ఉంది, ఇక్కడ సగటున రోజుకు 60 హత్యలు జరుగుతుండటం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement