మరో రెండు నెలలైతే..
మరో రెండు నెలలైతే ఏడాది కాలం (80శాతం శిక్షణ) పూర్తవుతుంది. ఆగస్టు–సెప్టెంబర్ నెలలో తిరిగి సుమంత్ స్వదేశానికి వచ్చేవాడు. పెళ్లిచేసుకున్నాక మరో 20 శాతం శిక్షణ పూర్తి చేసుకోవడానికి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్తానని సుమంత్ చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఫోన్ కాల్‌తో కుప్పకూలిన కుటుంబం
శనివారం వచ్చిన ఒక ఫోన్‌కాల్ ఆ కుటుంబాన్ని తలకిందులు చేసింది. ‘సుమంత్ ప్రయాణిస్తున్న శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది... అతడు ఇక లేడు’ అనే వార్త వినగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
హసన్‌పర్తి: తల్లిదండ్రులకు అండగా నిలవాలని... పైలట్‌గా ఉన్నత స్థానానికి చేరుకోవాలని సుమంత్ కన్న కలలు ఒక్క ప్రమాదంతో ముగిశాయి. ఆకాశాన్ని తాకాలని బయల్దేరిన యువకుడిని.. అదే ఆకాశం శాశ్వతంగా తనలో కలుపుకోవడం అందరినీ కలచివేస్తోంది. విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ ఆ తల్లి చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. పైలట్‌గా తిరిగి వచ్చి తల్లిదండ్రులకు గర్వకారణంగా రావాల్సిన ఆ కుమారుడు.. శవపేటికలో వస్తాడనే విషయాన్ని ఆ కుటుంబం ఊహించలేదు. హసన్‌పర్తికి చెందిన ఆడెపు సుమంత్ (21) దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్‌్గలో పైలట్ శిక్షణ పొందుతున్న సమయంలో శిక్షణ విమానం (భారత కాలమానం ప్రకారం) శనివారం కుప్పకూలడంతో మృతిచెందాడు. ఈ వార్త అందుకున్న కుటుంబం, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మధ్య తరగతి కుటుంబంనుంచి..
హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడేపు వరలక్ష్మీ–చంద్రమౌళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్‌పర్తిలో స్థిరపడింది. ఆయన పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడేపు సుమంత్ ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత 6వ తరగతి నుంచి పదోతరగతి వరకు ఎల్లాపురంలో ఎస్పీఆర్ పాఠశాల జరిగింది. ఇంటర్ ఆల్ఫోర్స్‌లో పూర్తి చేశాడు. పైలెట్ కావాలన్నదే సుమంత్ లక్ష్యం. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. దక్షిణాఫ్రికాలో శిక్షణ కోసం గతేడాది వెళ్లాడు.
గ్రామమంతా శోకసంద్రం
సుమంత్ మరణవార్త తెలియగానే హసన్‌పర్తి గ్రామానికి చెందిన బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేసినా వారి రోదనలు ఆగడం లేదు. గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. ‘చాలా మంచివాడు.. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు.. ఇంత చిన్న వయసులో ఇలా జరగడం బాధాకరం’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులు ఆగాలంటున్నారు..
సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతోందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.


