రీపోలింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన | No repoll ordered in Tamil Nadu, West Bengal says ECI | Sakshi
Sakshi News home page

రీపోలింగ్‌పై ఈసీ సంచలన ప్రకటన

Apr 25 2026 11:05 AM | Updated on Apr 25 2026 11:18 AM

No repoll ordered in Tamil Nadu, West Bengal says ECI

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కీలక ప్రకటన చేసింది. మొదటి విడత పోలింగ్ ముగిసిన ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి రీపోలింగ్ నిర్వహించబోమని స్పష్టం చేసి, పలువురి ఊహాగానాలకు తెరదించింది. ఏప్రిల్ 23న (2026) జరిగిన పశ్చిమ బెంగాల్ (152 స్థానాలు), తమిళనాడు (234 స్థానాలు) ఎన్నికల్లో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఈసీ అధికారులు తేల్చి చెప్పారు.

బెంగాల్‌లోని 44,376 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. మిగిలిన 142 స్థానాలకు బెంగాల్‌లో ఏప్రిల్ 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. తొలి విడత తరహాలోనే రెండో విడతను కూడా ప్రశాంతంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించాలని బీజేపీ నేత తపస్ రాయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీస్ అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించింది. డైమండ్ హార్బర్ అదనపు ఎస్పీ సందీప్ గరాయ్, ఎస్డీపీఓ సజల్ మండల్, ఇన్‌స్పెక్టర్ మౌసమ్ చక్రవర్తితో పాటు ఫాల్టా, ఉస్తి పోలీస్ స్టేషన్ల అధికారులైన అజయ్ బాగ్, శుభేచ్ఛా బాగ్‌లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీరందరిపై కఠిన క్రమశిక్షణ చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

విజయంపై అంచనాలు..
ఎన్నికల ఫలితాలపై అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు మిత్రపక్షాలు తీవ్ర ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బెంగాల్‌లో మొదటి విడత ఎన్నికల్లోనే టీఎంసీ ‘సెంచరీ (100+ స్థానాలు)’ కొట్టేసిందని, ఈ పరిణామంతో బీజేపీ శిబిరంలో వణుకు పుట్టిందని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించారు. మరోవైపు, నార్త్ 24 పరగణాల జిల్లాలో టీఎంసీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగోసారి మమతా బెనర్జీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని అన్నారు.

ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే?

Advertisement
 
Advertisement
Advertisement