హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం‘నైరుతి’ వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అడిక్‌మెట్, విద్యానగర్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది.
పలు జంక్షన్లు చెరువులను తలపించాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే వేళ వర్షం పడటంతో ఐటీ కారిడార్ సహా పలు మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవించారు. మల్కాజ్‌గిరిలో 12.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో 8.7 సెం.మీ., విఠల్‌వాడీలో 7.8 సెం.మీ. వాన పడింది.


