కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 92.9 శాతం రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు అందరి దృష్టి బుధవారం జరగనున్న రెండో విడతపైనే పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతవుతున్నాయనే భయం, తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడుమ.. ఫేజ్-2లో కూడా ఓటర్లు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఆస్పత్రి నుంచి.. ముంబై నుంచి..
ఓటు హక్కు ఎక్కడ కోల్పోతామో అనే ఆందోళన బెంగాల్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. క్యాన్సర్ చికిత్సను సైతం వాయిదా వేసుకుని ఓటు వేసేందుకు ఒకరు సిద్ధపడగా.. ముంబైలో పనిచేసే రొకిడా బీబీ లాంటి వలస కార్మికులు రూ.8,000 ఖర్చు పెట్టి మరీ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ‘గతంలో ఓటు వేయలేదు, కానీ ఇప్పుడు వేయకపోతే మళ్లీ అవకాశం రాదేమో’ అన్న వారి మాటలే ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అర్బన్ ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లో ఉండే నిపుణులు సైతం రిటర్న్ టికెట్లు బుక్ చేసుకుని మరీ ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు.
45 లక్షల పేర్లు గల్లంతు.. వణికిపోతున్న జిల్లాలు
రెండో దశ ఎన్నికలు జరగనున్న నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, కోల్‌కతా (నార్త్, సౌత్), హౌరా, హుగ్లీ, నదియా, ఈస్ట్ బర్ద్వాన్ తదితర ఎనిమిది జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఏకంగా 45 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడం సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా తీసేసిన పేర్లలో సగానికి పైగా ఇక్కడే ఉండటం గమనార్హం. కేవలం నార్త్ 24 పరగణాల్లోనే 10 లక్షలు, సౌత్ 24 పరగణాల్లో 9.1 లక్షల పేర్లు జాబితాలో లేవు. నదియా జిల్లాలోని మతువా సామాజిక వర్గ ప్రాంతాల్లో అత్యధికంగా 78% తొలగింపులు జరగడం ఓటర్లలో తీవ్ర ఆందోళన పెంచుతోంది.
రాజకీయ ప్రకంపనలు.. భారీ పోలింగ్ అంచనా
ఈ పరిణామాలపై బెంగాల్ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పేర్లు పెద్ద ఎత్తున తొలగించడం వల్లే వారు కసితో ఓటేయడానికి వస్తున్నారని తృణమూల్ మంత్రి శశి పంజా ధీమా వ్యక్తం చేయగా.. అధికార పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతే ఈ భారీ పోలింగ్‌కు కారణమని ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు. గల్లంతు భయాలు, వలస కార్మికుల రాక, హోరాహోరీ రాజకీయ పోరు నేపథ్యంలో ఈసారి కూడా పోలింగ్ 90 శాతానికి పైగానే (రికార్డు స్థాయిలో) నమోదయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సముద్రంలో ఉద్రిక్తత: ఇరాన్‌కు అమెరికా మరో షాక్


