సముద్రంలో ఉద్రిక్తత: ఇరాన్‌కు అమెరికా మరో షాక్ | US Navy Intercepts Iranian Ship Amid Strict Blockade | Sakshi
Sakshi News home page

సముద్రంలో ఉద్రిక్తత: ఇరాన్‌కు అమెరికా మరో షాక్

Apr 25 2026 9:07 AM | Updated on Apr 25 2026 9:44 AM

US Navy Intercepts Iranian Ship Amid Strict Blockade

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా, మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. తాజాగా ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా  కలకలం రేపుతోంది.

రంగంలోకి యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా
ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ (DDG 115) అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శనివారం అధికారికంగా ప్రకటించింది.
 

దిగ్బంధనం కఠినతరం
వాషింగ్టన్ ఆదేశాల మేరకు ఇరాన్ సముద్ర మార్గాలను, ఓడరేవులను దిగ్బంధించే భారీ ఆపరేషన్‌లో ఈ చర్య ఒక భాగం మాత్రమే అని మిలిటరీ అధికారులు తెలిపారు. ‘ఎక్స్’ వేదికగా సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇరాన్ తీరాలకు సరుకుల రవాణాను నిలువరించడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని అమెరికా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ ఘటనతో సముద్ర జలాల్లో హైఅలర్ట్ వాతావరణం నెలకొంది.

చర్చలకు ఇరాన్ ససేమిరా
ఈ సైనిక చర్యలకు తోడు, దౌత్యపరంగా కూడా ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ ప్రత్యేక ప్రతినిధులుగా స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లను పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు పంపారు. అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఇస్లామాబాద్ పర్యటనలో ఉన్నారు. అయితే అమెరికా ప్రతినిధి బృందంతో నేరుగా ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. కీలక నేతలు ఒకే నగరంలో ఉన్నప్పటికీ దౌత్యం ఫలించకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు

Advertisement
 
Advertisement
Advertisement