రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు | Rare Russia-Ukraine Prisoner Swap Brings 386 Soldiers Home | Sakshi
Sakshi News home page

రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు

Apr 25 2026 8:27 AM | Updated on Apr 25 2026 8:48 AM

Rare Russia-Ukraine Prisoner Swap Brings 386 Soldiers Home

వాషింగ్టన్‌: బద్ధ శత్రువులైన రష్యా, ఉక్రెయిన్ దేశాలు అనూహ్యంగా ఒక అంగీకారానికి వచ్చాయి. అమెరికా, యూఏఈ దేశాల సంయుక్త మధ్యవర్తిత్వంతో 386 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకున్నాయి. శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయిన ఈ తరుణంలో జరిగిన ఈ హఠాత్పరిణామం, భీకర యుద్ధ వాతావరణంలో సరికొత్త ఆశలను చిగురింపజేసింది.

సుదీర్ఘ చర్చల ఫలితం
రష్యా, ఉక్రెయిన్ దేశాలు చెరో 193 మంది పట్టుబడిన సైనికులను శుక్రవారం సురక్షితంగా విడుదల చేశాయి. ఈ నెలలో ఖైదీలను ఇలా మార్చుకోవడం ఇది రెండవసారి. ఉక్రెయిన్ అధ్యక్షులు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ అరుదైన విషయాన్ని ధృవీకరిస్తూ, తమ యోధులను స్వదేశానికి రప్పించడానికి అనునిత్యం శ్రమిస్తున్నామని ప్రకటించారు. పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ ప్రాంతంలో బంధించారని, కొన్ని నెలల పాటు జరిగిన చర్చల అనంతరం వారి విడుదల సాధ్యమైందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

కన్నీటి పర్యంతమైన యోధులు
ఉత్తర ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న సైనికుల పరిస్థితి అందరినీ కలచివేసింది. సుదీర్ఘకాలం రష్యా చెరలో ఉండి, ముఖాలు పాలిపోయినప్పటికీ, స్వదేశంలో అడుగుపెట్టగానే వారి కళ్లలో చెప్పలేనంత ఆనందం, ఉపశమనం కనిపించాయి. బస్సుల నుంచి దిగుతూనే తమ జాతీయ జెండాలను కప్పుకుని, తోటి సైనికులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నారు. ఫోన్లలో తమ వారితో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. విడుదలైన వారిలో 24 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. ఇద్దరు సైనికులు తమ పుట్టినరోజు నాడే విడుదల కావడం గమనార్హం.

అమెరికా, యూఏఈ కీలక పాత్ర
ఈ చారిత్రక ఖైదీల మార్పిడిలో అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు కీలకమైన మానవతా దృక్పథంతో దౌత్యం నెరపాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వదేశానికి చేరుకున్న తమ రష్యన్ సైనికులకు మిత్రదేశమైన బెలారస్‌లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు నిలిచిపోయినప్పటికీ, ఈ పరిణామం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న అతికొద్ది సహకార మార్గాలలో ఒకటిగా నిలిచింది.

ఇది కూడా చదవండి: ఎండకు పగపట్టిన పాములు .. ఇళ్లలోకి చొరబడి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement