ఎండకు పగపట్టిన పాములు .. ఇళ్లలోకి చొరబడి.. | Kerala On High Alert 4 Snakebite Deaths In A Week | Sakshi
Sakshi News home page

ఎండకు పగపట్టిన పాములు .. ఇళ్లలోకి చొరబడి..

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:54 AM

Kerala On High Alert 4 Snakebite Deaths In A Week

తిరువనంతపురం: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదేసమయంలో ఎండ వేడికి తాళలేక ప్రాణాంతక విష సర్పాలు ఇళ్లలోకి  చొరబడుతుండటంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జనం కాలం వెళ్లదీస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో పాము కాటుకు గురై ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం కేరళలో కలకలం రేపుతోంది. ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. పాముకాటు మరణాలను అరికట్టేందుకు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రభుత్వ హెచ్చరికలు.. యాంటీ-వెనమ్ ఎక్కడ?
వరుస మరణాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ జిల్లా వైద్యాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. పాముకాటు బాధితులకు తక్షణమే ప్రథమ చికిత్స, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణ అత్యంత కీలకమని తెలిపారు. యాంటీ-వెనమ్ (విషానికి విరుగుడు మందు) లేని ఆసుపత్రులకు వెళ్లి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 146 ఆస్పత్రులతో పాటు అన్ని తాలూకా స్థాయి ఆస్పత్రులు, కొన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ ప్రాణరక్షక మందు అందుబాటులో ఉందని ఆమె వెల్లడించారు.

108 అంబులెన్స్.. ప్రాణాలకు రక్ష
పాముకాటుకు గురైన తక్షణమే ‘కనివు 108’ (Kanivu 108) అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఈ అంబులెన్స్‌లలో ఉండే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు, యాంటీ-వెనమ్ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల జాబితాను కలిగి ఉంటారు. దీనివల్ల ఏమాత్రం ఆలస్యం లేకుండా రోగిని సరైన వైద్యశాలకు తరలించే అవకాశం ఉంటుంది. బాధితుడు ఆందోళన చెందితే రక్తంలో విషం వేగంగా వ్యాపిస్తుంది. అందుకే అంబులెన్స్ వచ్చేలోపు రోగిని ప్రశాంతంగా ఉంచడం ముఖ్యం.

వేసవి ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఎండాకాలం తీవ్రత కారణంగా పాములు నీడ, చల్లదనం, ఎలుకల కోసం వెతుక్కుంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాము  కాటువేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనివ్వకూడదు లేదా పరిగెత్తనివ్వకూడదు. బాధితుడిని స్ట్రెచర్‌పై మాత్రమే మోసుకువెళ్లాలి, అలాగే గాయం చుట్టూ గట్టిగా తాడు లాంటివి కట్టకూడదు. సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఎంతో ముఖ్యం. లక్షణాలు, ల్యాబ్ పరీక్షల ఆధారంగా కచ్చితమైన ప్రొటోకాల్ ప్రకారం మాత్రమే చికిత్స అందించాలని కేరళ ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: విజయ్ ఒక ప్రయోగం.. మమత ఒక పాఠం!

Advertisement
 
Advertisement
Advertisement