తాలిబన్ కమాండర్‌కు అమెరికాలో 42 ఏళ్ల శిక్ష! | Ex Taliban Commander Sentenced To 42 Years In US Prison For Terror Acts And Kidnapping Journalist, More Details Inside | Sakshi
Sakshi News home page

తాలిబన్ కమాండర్‌కు అమెరికాలో 42 ఏళ్ల శిక్ష!

Jun 10 2026 10:57 AM | Updated on Jun 10 2026 11:19 AM

Ex Taliban Commander Sentenced to 42 Years in US Prison for Terror Acts

వాషింగ్టన్‌: అమెరికా సైనికుల మరణాలకు కారకుడు, అంతర్జాతీయ జర్నలిస్ట్‌ను బందీ చేసిన  తాలిబన్ మాజీ కమాండర్ హాజీ నజీబుల్లాకు అమెరికా ఫెడరల్ కోర్టు 42 ఏళ్ల సుదీర్ఘ జైలు శిక్షను ఖరారు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ కాలంలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన ఈ 50 ఏళ్ల నిందితుడు, అమెరికా కోర్టులో తన నేరాలను అంగీకరించాడు. ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇవ్వడం, విదేశీయులను బందీలుగా మార్చడం వంటి అభియోగాలపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ సంచలన తీర్పును వెల్లడించింది.

అమెరికా సైనికులపై ఘాతుకం
2007 నుండి 2009 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని వర్దక్ ప్రావిన్స్‌లో తాలిబన్ కమాండర్‌గా నజీబుల్లా నెత్తుటి ఏరులు పారించాడు. నాటో దళాలు, అమెరికా సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, ఐఈడీ పేలుళ్లను ఇతని నాయకత్వంలోనే ఉగ్రవాదులు అమలు చేశారు. ముఖ్యంగా 2008 జూన్ 26న అమెరికా మిలిటరీ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులతో పాటు ఒక ఆఫ్ఘన్ అనువాదకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఉగ్రదాడికి తానే బాధ్యుడినంటూ నజీబుల్లా అప్పట్లో బాహాటంగానే  చెప్పుకున్నాడు.

జర్నలిస్ట్ కిడ్నాప్.. తుపాకీ నీడలో 7 నెలలు
సైనికులపై దాడుల అనంతరం 2008 నవంబర్‌లో ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్ట్ డేవిడ్ రోడ్, అతని డ్రైవర్, అనువాదకుడిని నజీబుల్లా బృందం కిడ్నాప్ చేసింది. వారిని పాకిస్తాన్‌లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతాలకు తరలించి, దాదాపు ఏడు నెలల పాటు బందీలుగా ఉంచారు. అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తుపాకీ గురిపెట్టి జర్నలిస్ట్‌తో ప్రాధేయపడేలా వీడియోలు రికార్డు చేయించారు. అయితే ఆ జర్నలిస్ట్ 2009 జూన్‌లో  ఉగ్రవాదుల నుండి తప్పించుకున్నారు.

చాకచక్యంగా అరెస్ట్.. న్యాయం గెలిచింది
దాదాపు దశాబ్ద కాలం పాటు తప్పించుకు తిరిగిన నజీబుల్లాను 2020లో ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ దళాలు పట్టుకుని అమెరికాకు అప్పగించాయి. అమెరికా పౌరులను, సైనికులను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు ఎంతకాలం తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అన్నారు.

ఇది కూడా చదవండి: ఐర్లాండ్‌లో చెలరేగిన అల్లర్లు: కత్తిపోట్ల ఘటనతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement