ఓటీటీలో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'మా బెహన్' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌తో పాటు మరో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తన తాజా చిత్రంతో క్రేజ్ సంపాదించుకుకున్న ఈ నటి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్రాపర్టీ ఇపుడు నెట్టింట విశేష చర్చగా మారింది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సుమారు రూ. 14 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.
IndexTap.com ద్వారా అందించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ గ్రౌండ్-ప్లస్-టూ (G+2) అంతస్తుల ఇల్లు నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న కార్టర్ రోడ్ పరిసరాల్లో ఉంది.ప్రీమియం ఏరియాలోని ఈ ప్రాపర్టీ 2,226 చదరపు అడుగుల్లో , 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో ఈ బంగ్లా స్పెషల్‌గా ఉంటుంది. ఈ బంగ్లా కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి. హంగూ ఆర్భాటాల కంటే సరళత, సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇల్లును తీర్చిదిద్దుకుందిట. సాఫ్ట్ టోన్స్ (మృదువైన రంగులు), డెకర్ ఎలిమెంట్స్‌తో కూడిన 'మినిమలిస్ట్' లుక్‌తో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే లివింగ్ రూమ్ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా, చాలా ప్రశాంతంగా డిజైన్ చేశారు. మ్యూటెడ్ వాల్స్ (లైట్ కలర్ గోడలు) మధ్యలో ఉన్న ఒక 'పిస్తా గ్రీన్' కలర్ సోఫా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఓవరాల్ కలర్ ప్యాలెట్ న్యూట్రల్‌గా ఉంటూ, ప్రతీ వస్తువు ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు.

గ్లాస్ ఎలిమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్
ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా, ఇండోర్, అవుట్‌డోర్ ప్రదేశాలను కలుపుతూ విశాలంగా కనిపించేలా పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెళ్లు, పార్టిషన్లను ఉపయోగించారు. పచ్చదనాన్ని జోడిస్తూ మొక్కలు, సాధారణ డెకర్ వస్తువులతో బాల్కనీని అలంకరించారు. ఇంకా 'డెకరేటివ్ షాడో ల్యాంప్స్' మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సాఫ్ట్ లైటింగ్ గదికి మరింత వెచ్చదనాన్ని, ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కాగా 'కాలా', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన తృప్తి దిమ్రి ఈ నెల ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తాజా చిత్రం 'మా బెహన్' నటనతో మంచి మార్కులు కొట్టేసింది.


