ఒకప్పుడు సొంత ఇల్లు కొనడం ఓ కల మాత్రమే. చిన్న గదిలో కుటుంబంతో కలిసి జీవించిన ఓ యువ నటుడు.. ఆ తర్వాత నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బంగ్లా కొనుగోలు చేశాడు. కానీ ఆ కలల ఇల్లు కొన్నాళ్లకే అతడికి ఆందోళనకు కారణమైంది. వరుస పరాజయాలతో ఆ బంగ్లా తనకు కలిసి రావడం లేదని భావించి వదిలేశాడు. అయితే కాలం గడిచాక అదే ఆస్తి అతడి జీవితంలోనే అతిపెద్ద పెట్టుబడిగా మారింది. ఆ కథ ప్రముఖ నటుడు జీతేంద్రది.
ముంబైలోని చాల్ జీవితం నుంచి స్టార్‌డమ్ వరకు ఎదిగిన జీతేంద్ర.. తన కెరీర్ ప్రారంభ దశలోనే ఓ పెద్ద కల నెరవేర్చుకున్నారు. అప్పట్లో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. పాలి హిల్‌లోని తన బంగ్లాను విక్రయించేందుకు ముందుకొచ్చారు. జీతేంద్ర తండ్రితో చర్చించిన తర్వాత ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆ ఆస్తి ధర కేవలం రూ.4.25 లక్షలు మాత్రమే. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లా అప్పట్లోనే ఎంతో విలువైన ఆస్తి.
కొన్నాకే మొదలైన కష్టాలు..
బంగ్లాలోకి మారిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్లుగా సాగలేదని జీతేంద్ర గుర్తు చేసుకున్నారు. వరుసగా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో ఆ ఇంటి వల్లే తనకు దురదృష్టం వెంటాడుతోందని ఆయన భావించారు. “భరత్ భూషణ్ ఈ ఇంటిని వదిలేశారు.. ఇప్పుడు నా వంతు వచ్చినట్లు అనిపించింది. ఇలాగే కొనసాగితే నా కెరీర్ మొదలయ్యేలోపే ముగిసిపోతుందేమో అనుకున్నాను” అని జీతేంద్ర గతాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బంగ్లాను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అన్‌లక్కీ అనుకున్నదే అదృష్టంగా మారింది
ఏళ్లు గడిచిన తర్వాత అదే ఆస్తి విలువ ఊహించని స్థాయికి చేరుకుంది. ఆ బంగ్లాను పునర్నిర్మించాలని నిర్ణయించిన సమయంలో ఆసక్తికర విషయం బయటపడింది. పాత భవనాన్ని కూల్చినప్పుడు అందులో ఉపయోగించిన బర్మా టీక్ కలపకే రూ.11.5 లక్షలు వచ్చాయని జీతేంద్ర తెలిపారు. అంటే.. మొత్తం బంగ్లాను కొనుగోలు చేసిన ధర కంటే కలప ద్వారా వచ్చిన మొత్తం ఎక్కువ కావడం విశేషం.

రూ.85కు అమ్మిన ఫ్లాట్లు.. ఇప్పుడు రూ.85 వేల ధర
తర్వాత ఆ స్థలంలో జీతేంద్ర గౌతమ్ అపార్ట్‌మెంట్స్ నిర్మించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో భవిష్యత్తుపై సందేహంతో ఫ్లాట్లను చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున విక్రయించారు. కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు చదరపు అడుగు ధర దాదాపు రూ.85 వేల వరకు చేరిందని ఆయన కుమారుడు తుషార్ కపూర్ వెల్లడించారు.

రూ.4.25 లక్షల ఆస్తి.. రూ.450 కోట్ల విలువ
ఒకప్పుడు దురదృష్టానికి కారణమని భావించిన ఆ బంగ్లా.. ఇప్పుడు జీతేంద్ర జీవితంలో అత్యంత విలువైన ఆస్తిగా మారింది. ప్రస్తుతం ఆ భవనం ఉన్న స్థలం విలువ దాదాపు రూ.450 కోట్ల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. ఓ ఆస్తిని చూసే దృష్టి కాలంతో ఎలా మారిపోతుందో జీతేంద్ర బంగ్లా కథ చెబుతోంది. అప్పట్లో భయంతో వదిలేసిన ఇల్లు.. ఇప్పుడు కోట్ల విలువైన సంపదగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సినీ తారలకు రియల్ ఎస్టేట్ కలిసి వచ్చిన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తెలుగు సినీ దిగ్గజం శోభన్‌బాబు కూడా సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టి భారీ సంపదను సృష్టించారు. అప్పట్లో భూములపై ముందుచూపుతో పెట్టిన పెట్టుబడులు.. తర్వాత కాలంలో కోట్ల విలువైన ఆస్తులుగా మారాయి. జీతేంద్ర బంగ్లా కథ కూడా ఇలాంటి దూరదృష్టికి మరో ఉదాహరణగా నిలుస్తోంది.


