త్వరలో రెండు ఎన్సీపీల విలీనం!
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం.
మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నీట్–యూజీ పేపర్‌పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్ మేనేజ్‌మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది.
శరద్ పవార్ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది.


