సినిమా హీరోలు తమ డబ్బులకు ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెడుతుంటారు. పారితోషికంగా సంపాదించిన డబ్బులతో బంగ్లాలు కొనుగోలు చేసి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం రూ. 84 కోట్లతో విలాసవంతమైన బంగ్లాను ఆయన కొనుగోలు చేశాడు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం, ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 14న పూర్తయింది. ఈ కొనుగోలుకు గాను ఆయన సుమారు రూ. 5.04 కోట్ల రూపాయలను స్టాంప్ డ్యూటీ రూపంలో చెల్లించినట్లు సమాచారం.
ఈ ఆస్తి మొత్తం 1,017.60 చదరపు మీటర్ల ఫ్లాట్‌లో విస్తరించి ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతం కలిగిన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు - విఐపిలు నివసించే ప్రైమ్ లొకేషన్లలో బాంద్రా వెస్ట్ ఒకటి. ఇక్కడ స్వంత స్థలంతో ఉన్న బంగ్లాలు దొరకడం అత్యంత అరుదు కావడం వల్ల జాన్ చేసిన ఈ రూ. 84 కోట్ల బిగ్ డీల్ ప్రస్తుతం సినీ, బిజినెస్ వర్గాల్లో వైరల్‌గా మారింది.
జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 2023లో కూడా ముంబైలోని ఖార్ ఏరియాలో రూ. 70.83 కోట్ల విలువైన బంగ్లాను ఆయన సొంతం చేసుకున్నారు.
ఇక సినీ కెరీర్ విషాయానికొస్తే.. ఇటీవల 'ది డిప్లొమాట్', 'తెహ్రాన్' వంటి వైవిధ్యమైన యాక్షన్- పొలిటికల్ థ్రిల్లర్లతో అలరించాడు. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్‌తో పాటు తన కెరీర్‌లో సూపర్ హిట్ అయిన యాక్షన్ ఫ్రాంచైజ్ 'ఫోర్స్' మూడో భాగం -ఫోర్స్ 3 లో నటిస్తున్నాడు. ఈ రెండింటిలోనూ జాన్ అబ్రహం పోలీసులు ఆఫీసర్‌గా అలరించబోతున్నాడు.


