న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రను తన కెమెరా లెన్స్‌తో ఒడిసిపట్టిన ఆ మహా మనిషి మనకు దూరమయ్యారు. దశాబ్దాల పాటు అనేక చారిత్రక ఘట్టాలను, విషాదాలను, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘భారత ఫోటో జర్నలిజం పితామహుడు’ రఘు రాయ్ (83) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కన్నీళ్లు పెట్టించిన భోపాల్ విషాదం
రఘు రాయ్ కెమెరా క్లిక్ మంటే అది చరిత్రే. ముఖ్యంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో ఆయన తీసిన ఛాయాచిత్రాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. సగం పూడ్చిపెట్టిన ఒక చిన్నారి కళ్లలోని విషాదాన్ని ఆయన బంధించిన తీరు, ఆ దుర్ఘటన యొక్క తీవ్రతను కళ్లకు కట్టింది. ఈ గుండెలు పిండేసే ఘటనపై ఆయన ‘ఎక్స్‌పోజర్: ఏ కార్పొరేట్ క్రైమ్’ అనే పుస్తకాన్ని, డాక్యుమెంటరీని కూడా రూపొందించారు.
మదర్ థెరిసా నుండి ఇందిరా గాంధీ వరకూ..
ఇందిరా గాంధీ కాలం నాటి దేశ అగ్రశ్రేణి నాయకుల అరుదైన ఫోటోలు ఆయన సేకరణలో ఉన్నాయి. మదర్ థెరిసాకు పోప్ సెయింట్ హోదా ఇవ్వడానికి చాలా కాలం ముందే, రఘు రాయ్ ఆమె జీవితంపై ‘సెయింట్ మదర్’ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె సేవా కార్యక్రమాలను అత్యంత సుదీర్ఘంగా రికార్డ్ చేసిన ఏకైక ఫోటోగ్రాఫర్ ఆయనే. ఆయన దేశ నలుమూలలా పర్యటించి భారతీయ ఆత్మను తన చిత్రాల్లో అద్భుతంగా బంధించారు.
ప్రపంచవ్యాప్తంగా అలుపెరగని ప్రయాణం
1962లో ‘ది స్టేట్స్‌మన్’ పత్రికతో వృత్తిని ప్రారంభించిన ఆయన, ప్రపంచ ప్రఖ్యాత ‘మాగ్నమ్ ఫోటోస్’లో సభ్యునిగా ఎదిగారు. ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్ బ్రెస్సన్ స్వయంగా ఈయనను నామినేట్ చేయడం విశేషం. టైమ్, లైఫ్, న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పత్రికల్లో ఆయన చిత్రాలు ప్రచురితమయ్యాయి. తన జీవితకాలంలో 18కి పైగా పుస్తకాలు రచించిన ఆయన, వరల్డ్ ప్రెస్ ఫోటో పోటీలకు మూడుసార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
ఇది కూడా చదవండి: ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి: ట్రంప్


