వెనకటికి ఒక సామెత ఉండేదంటారు.. పైన పటారం.. లోన లొటారం.. అని.. ఈ సామెత ఇప్పుడు అచ్చు గుద్దినట్టు ఇరాన్‌కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పైకి అంత బాగానే ఉన్నట్టు మేనేజ్ చేస్తున్న ఇరాన్.. వాస్తవంగా మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ఎంతలా అంటే.. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు.. చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. దీంతో, ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ మార్చి యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, పరిశ్రమలకు జరిగిన నష్టం.. ఇలా అన్నీ కలిసి పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇరాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2026 ఏప్రిల్ నాటికి పాలు, గుడ్లు, చికెన్, బియ్యం వంటి ఆహార పదార్థాలు 70–130% వరకు పెరిగాయి. ముఖ్యమైన ఔషధాలు అయితే 300% నుండి 2,700% వరకు పెరిగి సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరాయి. ఇన్సులిన్ కొరత కారణంగా రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా రేషన్‌లోనే అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య మందులు లభ్యం కావడం కష్టమైంది. దీంతో, సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుంచి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే, 2025 చివరి నాటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం 50% పైగా కొనసాగింది. రియాల్ విలువ 20 రోజుల్లో 20% కంటే ఎక్కువ తగ్గింది. బ్యాంక్ అయాందె కుప్పకూలడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లోనే యుద్ధం ప్రారంభమైంది. దీంతో, ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్స్‌కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడంలేదు సరి కదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంక్‌లు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి.
గుడ్డు, మాంసం ఎంతంటే..
గత రెండు నెలల్లో ఇరాన్‌లో గుడ్లు, మాంసం, వంట నూనె ధరలు నిరంతరం పెరిగాయి. గుడ్ల ధరలు 2026 ఏప్రిల్ నాటికి రూ.333(భారత కరెన్సీ ప్రకారం)కి చేరాయి. మాంసం ధర కిలోకు రూ.574 వరకు పెరిగాయి. 2025లో మాంసం ధర రూ.313గా ఉంది. ఇక, వంట నూనె ధరలు కూడా 100% పైగా పెరిగి 380 వరకు చేరాయి. 2025లో వంట నూనె ధర రూ.180గా ఉంది. ఇక, 2025లో బియ్యం ధర రూ.34 ఉండగా.. తాజాగా 67కు చేరుకుంది.
ఉద్యోగుల పరిస్థితి ఇదీ..
అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.
కారణాలు..
ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం.
యువత, చిన్న వ్యాపారాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.
పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
ప్రభావిత రంగాలు
ఈ-కామర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, మీడియా, విద్య, సర్వీస్ రంగాలు ప్రభావితమయ్యాయి.
నిరంతర కనెక్టివిటీ అవసరం ఉండటంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి.
పెద్ద కంపెనీలు: ఉద్యోగాల కోతలు ఇప్పుడు పెద్ద వాణిజ్య సంస్థలలో కూడా ప్రారంభమయ్యాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా, కనీస స్థాయిలో అయినా నిలబడే అవకాశం ఉంటుంది.
ప్రధాన లక్ష్యాలు..
ఆర్థిక స్థిరీకరణ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ విలువను నిలబెట్టడం.
ప్రజల జీవన ప్రమాణాలు: ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం.
పరిశ్రమల పునరుద్ధరణ: పెట్రోకెమికల్స్, మెటల్స్, వ్యవసాయం, నిర్మాణ రంగాలను తిరిగి నిలబెట్టడం.
బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణ: బ్యాంకుల లిక్విడిటీ, డిపాజిట్లపై నమ్మకం కాపాడుకోవడం, రుణాలపై నియంత్రణ.
సామాజిక స్థిరత్వం: నిరుద్యోగం తగ్గించడం, ప్రజల్లో అసంతృప్తి తగ్గించడం.
అంతర్జాతీయ సంబంధాలు: నిర్బంధం, బ్లాకేడ్ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు కనుగొనడం. యూఏఈ, టర్కీ వంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా పరిమిత ఎగుమతులు కొనసాగించడం.


