నెతన్యాహు భీకర ఆదేశాలు.. దాడులు షురూ | Netanyahu Orders Massive Strikes on Hezbollah Amid Ceasefire Breach | Sakshi
Sakshi News home page

నెతన్యాహు భీకర ఆదేశాలు.. దాడులు షురూ

Apr 26 2026 9:52 AM | Updated on Apr 26 2026 9:52 AM

Netanyahu Orders Massive Strikes on Hezbollah Amid Ceasefire Breach

జెరూసలేం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై భారీ దాడులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

ఇజ్రాయెల్ సైన్యానికి నెతన్యాహు గ్రీన్ సిగ్నల్
ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం, అలాగే దక్షిణ లెబనాన్‌లోని తమ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు దిగడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను బహిరంగ ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ, లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేయాలని శనివారం నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాలను (ఐడీఎఫ్‌) ఆదేశించారు. తమ భూభాగంపైకి వచ్చిన వైమానిక లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకున్నామని సైన్యం ప్రకటించింది.

లెబనాన్‌లో  ఉద్రిక్తత
ఇజ్రాయెల్ తాజా దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో  ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నబతియే జిల్లాలోని యోహ్మోర్ అల్-షకీఫ్ గ్రామంలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఒక ట్రక్కు, మోటార్ సైకిల్ ధ్వంసమై నలుగురు ప్రాణాలు కోల్పోగా, బింట్ జుబైల్ జిల్లాలోని సఫాద్ అల్-బత్తిఖ్ లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృతి చెందారు, 17 మంది గాయపడ్డారు. ఆయుధాలు తరలిస్తున్న సాయుధ వాహనాలను, హిజ్బుల్లా ఆపరేటివ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.

సందిగ్ధంలో శాంతిమంత్రం
మరోవైపు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే తాము దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ ఆర్మీ వాహనంపై దాడి చేశామని, ఇది కేవలం ఆత్మరక్షణ చర్య మాత్రమేనని హిజ్బుల్లా సమర్థించుకుంటోంది. ఏప్రిల్ 17న ప్రారంభమై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇటీవల పొడిగించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేస్తున్నారని ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. తాజా హింసతో ఈ శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది.

ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు

Advertisement
 
Advertisement
Advertisement