సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..! | Brides Banwara Sends A Message Of Equality Goes Viral | Sakshi
Sakshi News home page

సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..!

Apr 26 2026 3:18 PM | Updated on Apr 26 2026 3:18 PM

Brides Banwara Sends A Message Of Equality Goes Viral

చిన్న పనే చాలా పెద్ద మార్పుకు అంకురార్పణ అవ్వడమే గాక ఆలోచింపచేసేలా చేస్తుంది కూడా. కొన్ని నినాదాలు మాటలకే పరిమితమైపోతాయి. కానీ కొందరు వాటిని ఆచరణలో పెట్టి చూపించి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి ఘటనే గుజరాత్‌లో చోటు చేసుకుంది. 

అసలేం జరిగిందంటే..గుజరాత్‌లోని నార్నౌల్‌లోని ఒక ప్రత్యేకమైన వివాహ పూర్వ ఆచారం అందర్నీ ఆకర్షించడమే కాదు లింగ సమానత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచింది. బీకామ్ పట్టభద్రురాలైన నేహా జాంగ్రా, తన పెళ్లికి ఒక రోజు ముందు, శనివారం రాత్రి తన పరిసర ప్రాంతాల్లో ఆడ గుర్రంపై ఊరేగుతూ కనిపించింది.  

సంగీతం, ఉత్సవ నృత్యాలతో సాగిన ఈ ఊరేగింపు ఆనందం, గర్వంతో నిండిన వాతావరణాన్ని సృష్టించింది. ఆమె తండ్రి  హరిరామ్ జాంగ్రా చిన్న కిరాణ దుకాణం నడుపుతుంటారు.2017లో తన పెద్ద కుమార్తె వివాహ సమయంలో తానే ఈ ఆచారాన్ని మొదలుపెట్టానని చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలు కొడుకుల కోసమే ఉంటాయి కాబట్టి, అప్పట్లో ప్రజలు ఆశ్చర్యపోయారని అన్నారు. తాను కూతుళ్లు కూడా సమాన గౌరవానికి, అవకాశాలకు అర్హులని గట్టిగా నమ్ముతానని అన్నారు.

‘బేటీ బచావో, బేటీ పఢావో’ ప్రచార స్ఫూర్తికి అనుగుణంగా తన ఇద్దరు కుమార్తెలకు నాణ్యమైన విద్యను అందించానని ఆయన అన్నారు. "ఇది కేవలం ప్రతీకాత్మకం కాదు; ఇది నిజ జీవితంలో సమానత్వాన్ని ఆచరించడం గురించి," అని ఆయన నొక్కి చెప్పారు. అలాగే వధువు నేహా తల్లి సునీత ఇలాంటి కార్యక్రమాలు కుమార్తెల మనోధైర్యాన్ని పెంచుతాయని, విస్తృత సామాజిక మార్పుకు స్ఫూర్తినిస్తాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.

పెళ్లికి ముందు బంధువులు, ఇరుగుపొరుగు వారు హాజరైన ఒక సామూహిక విందును కూడా ఏర్పాటు చేయడంతో, ఈ ఘటన చిరస్మరణీయంగా నిలిచింది. కాగావడోదరలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన నిలేష్ కుమార్‌తో నేహా వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. 

(చదవండి: అక్కడ రైలులో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌ తప్పనిసరి..! ఎందుకో తెలుసా..)

 

Advertisement
 
Advertisement
Advertisement