దాపుడు అరలో దాగిన గౌరవం..! | Thaai-kizhavi An elderly woman holds a family together | Sakshi
Sakshi News home page

దాపుడు అరలో దాగిన గౌరవం..!

Apr 26 2026 2:32 PM | Updated on Apr 26 2026 2:32 PM

Thaai-kizhavi An elderly woman holds a family together

స్త్రీ జీవితంలో అనేక ఖాళీ అరలు ఉంటాయి. కాని స్త్రీ జీవితంలో తప్పక ఉండాల్సిన ఒక ‘దాపుడు అర’ గురించి ఎందరు ఆలోచిస్తారు? ‘తాయి కెళవి’ సినిమాలో ముసలవ్వ ఈ దాపుడు అర మాట్లాడుతుంది. ఆ ఒక్క అర ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో కూడా ఈ సినిమా చెప్పింది. ఇది అచ్చంగా ఒక బతుకు గోరే తల్లి కథ.

‘తాయి కెళవి’ చూస్తే తెలుగు వారి గొప్పతనం తెలిసొస్తుంది. ఇది గతంలో అంటే 1990లోనే వచ్చిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘బతుకుగోరే తల్లి’, ఆర్‌.ఎం.ఉమామహేశ్వర రావు ‘బిడ్డలు గల్ల తల్లి’ కథలను గుర్తు చేస్తుంది. పైకి గయ్యాళులుగా కనిపించే ఆ తల్లులు బిడ్డల క్షేమం కోసం లోపల ఎంత దయాళువుగా ఉంటారో పై రెండు కథలు గొప్పగా చూపాయి. అవి సినిమాలుగా తీసి ఉంటే మన గొప్ప తెలిసేది. తమిళంలో ‘తాయి కెళవి’ (జేజమ్మ) గా తీయడం వల్ల ఆ పేరు వారికి దక్కింది.

పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథలో ఇలాగే ఒక తల్లి ఉంటుంది. ఆమెను అందరూ ‘జేబు రమణమ్మ’ అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఆమె తన చిన్నప్పుడు ‘మగవాళ్లకు జేబు ఉన్నట్టుగా ఆడవాళ్లకు ఎందుకు ఉండదు’ అని ప్రశ్నిస్తుంది. మగవాళ్ల బలానికి, అహానికి జేబు కారణం అని, దాని నుంచి పుట్టే డబ్బు కారణమని జేబు రమణమ్మ అర్థం చేసుకుంటుంది. 

తను మరణించే వరకు తన ఆర్థిక స్వాతంత్య్రం గురించి నిర్లక్ష్యం వహించదు. అంతేకాదు, సొంత కోడలి పేర్న ఉన్న ఆస్తిని కొడుకు అమ్మడానికి చూస్తూ... అమ్మమని కోడల్ని బలవంతం చేస్తుంటే కోడల్ని వారించి ‘నీ ఆస్తి వాడికిచ్చావంటే నువ్వు బానిస బతుకు బతకాల్సి వస్తుంది’ అని చెప్పి, కొడుకు ఆగ్రహానికి గురయ్యి చావు కొని తెచ్చుకుంటుంది. మగవాళ్లు ఆడవాళ్లకు డబ్బు అందనివ్వరు. వారి దగ్గర ఉన్నది లాక్కునే దాకా ఊరుకోరు.

‘తాయి కెళవి’ పాత్ర పోషించిన రాధిక ఈ లోకరీతిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మన దగ్గర పైసలు ఉంటే లోకం మన ముఖం చూస్తుంది, ఖాళీచేతులు ఉన్నవారిని ఈసడిస్తుంది అని గ్రహిస్తుంది. డబ్బు లేనప్పుడు దయచూపని లోకంతో దయగా వ్యవహరించాల్సిన పని లేదనుకుంటుంది. అందుకే కఠినంగా వడ్డీ వసూలు చేస్తుంటుంది. 

‘సుఖంగా బతకడానికి డబ్బు కావాలో వద్దో తెలియదు గానీ గౌరవంగా బతకడానికి డబ్బు కావాలి’ అంటుంది. అందుకై మంచంలో ఒక రహస్య అరను ఏర్పాటు చేసుకుంటుంది. పైసా పైసా దాచి ఆ డబ్బుతో బంగారం కొని అదంతా ఆ అరలో భద్రం చేసుకుని ఉంటుంది. ప్రతి స్త్రీకి, గృహిణికి ఈ రహస్య అర అవసరం ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది.

తాయి కెళవి కుమార్తె సురళిని మొగుడు మూడు తులాల బంగారం ఇవ్వలేదని వదిలేసి ఉంటాడు. అతను కూతురిని పీడించుకుని తింటున్నాడని రాధిక గ్రహిస్తుంది. సహించడం త్యాగం కాదు, బానిసత్వం ఆమె దృష్టిలో. అందుకే కూతురిని తన దగ్గర ఉంచుకుని స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది. తల్లిగా తన దగ్గర డబ్బు లేక΄ోతే దీనమైన మాటలు చెప్పి భర్త దగ్గరకు పంపేదేమో. 

కాని ఈ తల్లి దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురికి కొత్త జీవితం ఇవ్వగలదు. అందుకే నీచుడైన అల్లుడితో విడాకులు ఇప్పించి రెండో మనువు చేస్తుంది. సొంత డబ్బు కలిగి ఉన్న తల్లికి వచ్చే ధైర్యం ఎలాంటిదో ఈ సినిమా చూపి దోవను సంకేతం చేస్తుంది.

‘చదువుకోండి. దానితోపాటు సంపాదించడం నేర్చుకోండి. మీ పర్సులో ఉన్న నాలుగు నోట్లే మీకు రక్షణ. మీ జీతమే మీకు స్వేచ్ఛ. మీరు డబ్బు దాచిన అర మీ పిల్లల జీవితాలు సరిదిద్దే మంత్రదండం’ అని నాలుగు తిట్లు కలిపి మరీ చె΄్తోంది ‘తాయి కెళవి’.
– కె.

(చదవండి: పెరిమెనోపాజ్‌ ఎఫెక్ట్‌: ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement