ఈ మధ్య బరువు పెరుగుతున్నారా! | Health Tips: Why am I gaining weight so fast during menopause | Sakshi
Sakshi News home page

పెరిమెనోపాజ్‌ ఎఫెక్ట్‌: ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!

Apr 26 2026 2:08 PM | Updated on Apr 26 2026 2:08 PM

Health Tips: Why am I gaining weight so fast during menopause

చాలామంది మహిళలు అటుఇటుగా మధ్యవయసుకు చేరుతుండగానే కాస్త లావెక్కుతుంటారు. ఈ దశలో వాళ్లకు ఒక సందేహం కూడా వేధిస్తుంటుందీ... ‘మేమేమీ ఎక్కువగా తినడంలేదు. మా ఆహార అలవాట్లలో మార్పులూ లేవు. అయినా ఇలా ఎందుకు బరువు పెరుగుతున్నామం’టూ బాధపడుతుంటారు. ఇలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం. 

నిజానికి మధ్యవయసుకు చేరుతూ... రుతుక్రమం ఆగిపోయేందుకు తొలి దశ అయిన  పెరీ–మెనోపాజ్, రుతుస్రావం పూర్తిగా ఆగిపోయే మెనోజ్‌కూ దగ్గరపడుతున్న సమయంలో అప్పటివరకూ వాళ్లలో స్రవిస్తున్న ఈస్ట్రోజెన్‌ మోతాదుల్లో తగ్గుదల మొదలవుతుంది. ఈ ఈస్ట్రోజెన్‌ మోతాదుల్లో తగ్గుదల జీవక్రియలూ (మెటబాలిజమ్‌), కొవ్వు నిల్వలూ, ఎనర్జీ వెలువడటాలనే పలు అంశాలలో మరికొన్ని మార్పులకు కారణమవుతుంది. 

మెనోపాజ్‌ దశలో స్థూలకాయం రావడానికి కారణాలేమిటి?
నిజానికి ఈస్ట్రోజెన్‌ అనే హార్మోన్‌.... ఇన్సులిన్‌ చేసే పనిలోనూ, అది వివిధ కణాలకు చేరే తీరుతెన్నులు, జీవక్రియల వేగం రేటు... ఈ అన్ని విషయాల్లోనూ కీలక భూమిక ΄ోషిస్తుంది. ఈస్ట్రోజెన్‌ క్రమబద్ధంగా వెలువడుతున్న రోజుల్లో అది దేహంలోని గ్లూకోజ్‌ సమంగా నిర్వహితమవుతూ, కండరాలన్నీ (మజిల్‌ మాస్‌) సమానంగా ఉండేలా చూస్తుంది. దాంతో దేహం దాదాపుగా సన్నగానే కనిపిస్తుంటుంది. 

కానీ ఈస్ట్రోజెన్‌ స్రావాలు మోతాదులు తగ్గుతున్న కొద్దీ ఇన్సులిన్‌ సెన్సిటివిటీ పెరుగుతుంది. దాంతో అది దేహంలో కొవ్వు పేరుకునే ప్రక్రియకు దారితీస్తుంది. ఈ క్రమంలో మొదట మహిళల పొట్టలో కొవ్వుపెరగడం దగ్గర్నుంచి మొదలై క్రమంగా ఒళ్లు లావెక్కడం కొనసాగుతుంది.  

తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం అంతే ఉన్నప్పటికీ... 
ఈ మధ్యవయసు దశలో మహిళలు తాము తీసుకునే ఆహారమూ, చేస్తుండే వ్యాయామంలో మార్పులు లేనప్పటికీ... జీవక్రియల్లో వచ్చిన పై మార్పు కారణంగా వాళ్ల దేహం బరువు పెరగడం మొదలువుతుంది. పెరీ–మెనోపాజ్‌ దశల్లో ఈస్ట్రోజెన్‌  హార్మోనల్‌ మార్పులు క్రమంగా మజిల్‌ మాస్‌ తగ్గిస్తూ పోవడంతో పాటు దేహంలో ఇన్‌ఫ్లమేషన్‌ పెంచుతూ పోతాయి. కండరాల్లో ఏదైనా గాయమైనప్పుడు దాని నుంచి కోలుకునే వేగాన్ని కూడా తగ్గిస్తాయి. మనం చేసే రోజువారీ పనులతో కండరాల్లో అయ్యే చిన్నపాటి గాయాలు తగ్గే వేగం కూడా మందగిస్తుంది. 

ఇలా ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడం అనే అంశం... మహిళలు తీసుకునే ఆహారాలు ఒంటికి పట్టడమూ (అబ్జార్బింగ్‌ ద న్యూట్రియెంట్స్‌), కండరాల నిర్మాణమూ, ఒత్తిడిని మేనేజ్‌ చేయడం (స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌), నిద్ర... వీటన్నింటినీ ప్రభావితం చేస్తూ... బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒత్తిడి పెరగడంతో దేహంలో కార్టిసోల్‌ అనే హార్మోన్లు స్రవించడానికి కారణం కావడమూ... దాంతో నిద్ర బాగా తగ్గడం... ఇలా కంటినిండా నిద్రలేనప్పుడు రెస్టింగ్‌ మెటబాలిజమ్‌ కూడా తగ్గడం వల్ల ఒళ్లు పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో  నిరూపితమైంది. అంటే... ఆహార అలవాట్లలో మార్పులు లేక΄ోయినప్పటికీ, ఇక్కడ పేర్కొన్న ఈ మార్పుల కారణంగా మధ్యవయసు రాగానే మహిళల్లో స్థూలకాయం పెరుగుతుంది. 

మెనోపాజ్‌ అనేది నివారించలేని దశ. అయితే ఈ ప్రక్రియల ద్వారా ఈస్ట్రోజెన్‌ తగ్గుదల వేగాన్ని నియంత్రించి, తద్వారా బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తూ  ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుంది. ఇక ఈస్ట్రోజెన్‌ తగ్గుదలతో వచ్చే పరిణామాల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే... డాక్టర్‌ను సంప్రదించి అందుకోసం హార్మోన్‌ రీ–ప్లేస్‌మెంట్‌ చికిత్స (హెచ్‌ఆర్‌టీ) వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ సమస్యను అధిగమించడం ఎలా... 
ఏజింగ్‌ లేదా వయసు పెరుగుతుండటం వల్ల వచ్చే మార్పుల విషయంలో ఏమీ చేయలేక΄ోయినప్పటికీ, అలా జరిగే తీరు మెల్లగా జరిగేలా చేయడం ద్వారా ఈ ప్రక్రియలను సాధ్యమైనంత ఆలస్యంగా జరిగేలా చేయడంతో పాటు దీనివల్ల కలిగే దుష్పరిణామాలను వీలైనంతగా నివారించవచ్చు. అందుకు ఆరోగ్యకరమైన మంచి జీవనశైలి (లైఫ్‌స్టైల్‌) బాగా ఉపయోగపడుతుంది.

మంచి పోషకాహారాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే మితిమీరిన వ్యాయామాలూ చేయకూడదు. దేహానికి మరీ శ్రమకలిగించని విధంగా కేవలం ఒళ్లు అలిసిపోయేలా మాత్రమే ఈ వ్యాయామాలు ఉండాలి. ఇందుకు  వాకింగ్, ఈత వంటి వ్యాయామాలు మంచివి. 

ఒత్తిడిని (స్ట్రెస్‌ను) వీలైనంతగా తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం, రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ వంటి ప్రక్రియలను అనుసరించవచ్చు. 

మందకొడిగా కాకుండా ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. 

కనీసం 7, 8 గంటలకు తగ్గకుండా కంటినిండా నిద్రపోవాలి.   
రూమా సిన్హా,  సీనియర్‌ కన్సల్టెంట్‌ ఆబ్‌స్టిట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌. 

(చదవండి: బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!)

Advertisement
 
Advertisement
Advertisement