
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు రోజురోజుకూ మెరుగవుతున్నకొద్దీ మానవ ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన పెరుగుతోంది. మనుషులు చేయగలిగే పనులన్నీ ఏఐ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను త్వరలోనే ఈ కొత్త ఏఐ టూల్స్ భర్తీ చేసే ప్రమాదం ఎక్కువవుతోంది.
టెక్ దిగ్గజాల సీఈవోలూ ఇదే హెచ్చరిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమ కంపెనీలోని ఉద్యోగులను ఏఐ తగ్గిస్తుందని స్వయంగా అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీనే కొన్ని వారాలుగా చెబుతూ వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఉద్యోగాలు ప్రభావితమవుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ కూడా ఇటీవల హెచ్చరించారు.
సమూల మార్పు
అయితే,ఈ క్రమంలో ఉద్యోగుల్లో ఏఐపై ఉన్న భయాల్ని పొగొట్టేలా గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఓ అడుగు ముందుకేసి ప్రస్తుతం ప్రత్యామ్నాయంగానే ఉన్న కృత్రిమ మేధస్సుతో రాబోయే ఐదు నుండి పదేళ్లలో ఉద్యోగ భావనలోనే సమూల మార్పు సంభవించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ‘వైర్డ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"ఉద్యోగ ప్రపంచంలో చాలా మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ గతంలో మాదిరిగానే మెరుగైన కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇవి ఈ సాధనాలు లేదా కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తాయి" అని హస్సాబిస్ అన్నారు.
డాక్టరుకూ ముప్పు?
ప్రస్తుతం మానవులు చేసే ప్రతి పనినీ ఏజీఐ లేదా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేయగలిగితే, రానున్న కొత్త ఉద్యోగాలను కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం భర్తీ చేయకుండా ఆపగలమా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. దీనికి హస్సాబిస్ బదులిస్తూ ఒక వైద్యుడి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయగలదు కానీ నర్సులను కాదు అన్నారు.
"సాధారణంగా డాక్టర్ ఏం చేస్తారు.. డాక్టర్ చేసే రోగ నిర్ధారణను ఏఐ టూల్ సాయంతో చేయవచ్చు. లేదా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరహా డాక్టర్లు రావచ్చు. కానీ నర్సులు అలా కాదు. ఎందుకంటే నర్సుల ఉద్యోగంలో మానవ సహానుభూతి ఎక్కువగా ఉంటుంది" అని వివరించారు.