 
													నెదర్లాండ్స్ ఎన్నికల్లో తేలని ఫలితం
అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమానంగా సీట్లు
ది హేగ్: నెదర్లాండ్స్ పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ ఫర్ ఫ్రీడం(పీవీవీ), ప్రతిపక్ష డెమోక్రాట్స్66(డీ66)లకు సమానంగా 
26 చొప్పున సీట్లు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా, 26 సీట్లు గెలుచుకోవడం డీ66 ఇదే మొదటిసారి. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏ ఒక్కటీ లేకపోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చని పరిశీలకులు అంటున్నారు. 
కొన్ని మున్సిపాలిటీలు, దూరప్రాంతాల మున్సిపాలిటీలు, పోస్టల్ ఓట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వాటి లెక్కింపు ఎప్పటికి పూర్తయ్యేది స్పష్టం కాలేదు. నాలుగు పార్టీలతో ఏర్పడిన గత ప్రభుత్వం కేవలం 11 నెలలు మాత్రమే మనుగడలో ఉంది. వలస విధానాలపై అంతర్గత కుమ్ములాటలతో ఆ ప్రభుత్వం జూన్‌లో పడిపోయింది. దీంతో, తాజాగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పీవీవీకి గట్టి దెబ్బ తగిలింది. జేఏ21 అనే చిన్న పార్టీ గత పార్లమెంట్‌లో కేవలం ఒక్క సీటుండగా, ఈ ఎన్నికల్లో 9 సీట్లకు బలం పెంచుకుంది. తాజా ఫలితాల వల్ల ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.   
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
