
భారత్‌ను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకోవాలి
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఒక సంక్షోభానికి సాధ్యమైనంత అతి తక్కువ సమయంలో ముగింపు పలకడం ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ తన లక్ష్యాలను అత్యంత కచి్చతత్వంతో నిర్ధారించుకుందన్నారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో మిలటరీకి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు.
దేశ రాజకీయ నాయకత్వం ఎలాంటి ఆంక్షలను విధించలేదని స్పష్టం చేశారు. మే 7–10వ తేదీల మధ్య పాకిస్తాన్‌తో కొనసాగిన సంక్షోభం సమయంలో వైమానిక దళం సత్తా చాటిందని పేర్కొన్నారు. ఎస్–400 క్షిపణి వ్యవస్థ సంక్షోభం గతినే మార్చేసిందని, ఈ ఆయుధ వ్యవస్థల శక్తిసామర్థ్యాలతో శత్రువు గుండెల్లో రైళ్లు పరుగెట్టాయన్నారు. శత్రువు సైనిక స్థావరాలు, మౌలిక వసతులు, రాడార్లు, కంట్రోల్ కోఆర్డినేషన్ వ్యవస్థలు, హంగార్లు, విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఎయిర్ చీఫ్ వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు దీర్ఘకాలం కొనసాగాయంటూ ఆయన.. సంఘర్షణకు సరైన ముగింపు కూడా ఆపరేషన్‌లో ఒక ముఖ్యమైన అంశమేనన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను మరింత కాలం కొనసాగిస్తే బాగుండేదన్న వాదనలను ఆయన కొట్టి పారేశారు. ‘ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అది. మనం చాలా తొందరగా యుద్ధాన్ని ముగించాం. చేయాలనుకున్నది చేసేశాం. శత్రువు అప్పటికే కాళ్ల బేరానికొచ్చింది.
ఇంకెందుకు ఈ సంక్షోభాన్ని కొనసాగించాలి? యుద్ధం వల్ల ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కూడా’అని ఆయన వివరించారు. మన ఆర్థిక వ్యవస్థతోపాటు దేశ పురోగతిపై పై ప్రభావం చూపుతుంది. ఆపరేషన్ పొడిగింపు వల్ల తర్వాతి చర్యలకు సన్నద్ధమయ్యే అవకాశం మనకుండదని తెలిపారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా సంక్షోభాన్ని ప్రారంభించడం, ముగింపు పలకడం అనే అంశాల్లో ప్రపంచ దేశాలు భారత్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ సింగ్ అన్నారు.