కేరళ, ఎరుమేలిలో కేంద్రం నిర్మించబోయే శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు పనులలో ముందడుగు పడింది. విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ, పరిహార అంచనా తదితర పనులను సంబంధిత రెవెన్యూశాఖ ప్రారంభించింది. రెవిన్యూ అధికారులు స్థలసేకరణ, భవనాలు, చెట్లు తదితర పరిహారానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
ఏటా అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు పెద్దఎత్తున కేరళకు వస్తుంటారు. అయితే భక్తుల సౌకర్యం దృష్ట్యా స్వామివారి దర్శనానికి భక్తులకు దగ్గరగా ఉండే విధంగా ఎరుమలిలో ఎయిర్‌ఫోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా అధికారులు దానికి సంబంధించి స్థల సేకరణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం చెరువల్లి ఎస్టేట్లో భూమిసేకరణలో భాగంగా చెట్లు, భవనాల విలువని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాంతంలో మెుత్తం 916.27 హెక్టార్లు భూమి సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అందులో 121.876 హెక్టార్లు స్థలంలో భవనాలు, నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. వాటి విలువ సేకరించిన అనంతరం పరిహారం నిర్ణయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళలో కేంద్రం ప్రతిపాదించిన శబరిమల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 జూలైలో ఆమోదం తెలిపింది. దీని అంచనా వ్యయం రూ.7,047 కోట్లు కాగా నిర్మాణం కోసం ఎరుమెలి,చెరువల్లి ఎస్టేట్‌లలో 2,570 ఎకరాల భూమి అవసరం కానుంది. ఈ మేరకు అధికారులు భూమి సేకరణ పనులు ప్రారంభించారు.


