మన దేశం మధుమేహ రాజధానిగా మారిపోయింది. 2022 నాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో మధుమేహ బాధితులు అత్యంత ఎక్కువగా ఉంది భారతదేశంలోనే. అయితే మధుమేహ బాధితులు అన్నింటికంటే ఎక్కువగా దృష్టిపెట్టాల్సింది వాళ్ల కాళ్లమీదేనని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు భాగ్యనగరంలో ఆదివారం వాకథాన్‌ను నిర్వహించారు. ఈ వాక్‌థాన్‌ను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల, టాలీవుడ్ నటుడు సుశాంత్, కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ప్రారంభించారు.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. “మధుమేహం అనేది చాలా సాధారణంగా మొదలయ్యే సమస్య. అసలు చాలామందికి అది ఉందన్న విషయమే మొదట్లో తెలియదు. దాన్ని గుర్తించేసరికే చాలా ఆలస్యం అవుతుంది. పైగా మధుమేహం ఉన్నవాళ్లు తమ కళ్లు, కాళ్లు, ఇతర అవయవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కంటిచూపు తగ్గుతున్నా, కాళ్ల మీద పుళ్లు కనిపించినా, ఏమైనా దెబ్బలు తగిలినా వెంటనే తగిన చికిత్సలు తీసుకోవాలి.
వాటిలో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామందికి కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రతిరోజూ తగినంత నడక, యోగా, లేదా మరేదైనా భౌతిక కార్యకలాపాలతో చురుకైన జీవనశైలి గడపాలి. స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల మీద ఎక్కువగా ఆధారపడితే శారీరక కార్యకలాపాలు తగ్గిపోయి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి” అని తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ రమేష్ గోరంట్ల మాట్లాడుతూ.. “ఇంతకుముందు మధుమేహం అంటే 50. 60 ఏళ్లు దాటినవాళ్లకే ఉండేది. కానీ ఇప్పుడు బాగా చిన్నవయసు వాళ్లలో కూడా ఇది ఉంటోంది.
పిల్లలు, యువత మామూలుగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఆటల్లో దెబ్బలు తగలడం సర్వసాధారణం. అయితే అలాంటప్పుడు మధుమేహం ఉన్నవాళ్లయితే వాళ్లకు గాయాలు అంత త్వరగా నయం కావు. ఇప్పుడు ఇక్కడున్న వైద్యులు, ఇతర ప్రముఖులు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఇలాంటి గాయాల వల్ల కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మధుమేహం ఉన్నవాళ్లు కాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు మధుమేహం స్థాయి పరీక్షించుకోవడంతో పాటు కీలక అవయవాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి” అని సూచించారు.
టాలీవుడ్ నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఇన్నాళ్ళూ కళ్లకు, ఎముకలకు, పొట్టలోని భాగాలకు.. ఇలా రకరకాల వైద్యులు ఉంటారని తెలుసు గానీ, ప్రత్యేకంగా పాదాల కోసం కూడా ఒక ప్రత్యేక వైద్యవిభాగం ఉందన్న విషయం నాలాంటి చాలామందికి తెలియదు. ఇటీవలి కాలంలో చాలామందికి మధుమేహం ఉంటోంది. అందువల్ల ప్రతి ఒక్కళ్లూ కాళ్ల విషయాన్ని సరిగ్గా పట్టించుకోవాలి. ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే ఇలాంటి ఫుట్ క్లినిక్‌లకు వచ్చి పరీక్ష చేయించుకోవాలి” అన్నారు.
ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ, “మధుమేహుల్లో 15-25% మందికి తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు కాళ్ల మీద పుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, మధుమేహ బాధితులకు నరాలు పాడవ్వడం వల్ల ఇలాంటి సాధారణ పుండ్ల వల్ల వాళ్లకు నొప్పి అంతగా తెలియదు.

అందువల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తారు. కానీ, మధుమేహం వల్ల కాళ్లు తొలగించాల్సిన పరిస్థితుల్లో 85% కేవలం ఇలాంటి పుండ్లకు చికిత్స చేయకపోవడం వల్లే వస్తాయి. సరైన సమయానికి పుండ్లకు చికిత్స చేయించకపోతే పరిస్థితి చాలా విషమంగా మారుతుంది. అందువల్ల మధుమేహం ఉన్నవారంతా ఎప్పటికప్పుడు తమ కాళ్ల విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పారు.
ఈ సందర్భంగా ద ఫుట్ డాక్టర్ ఆస్పత్రిలో డాక్టర్ వూండ్ అనే యాప్‌ను ఆవిష్కరించారు. సురక్షితమైన, పరిశుభ్రమైన డ్రసింగ్‌తో ఇంట్లోనే గాయాలను నయం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. నిపుణులైన వైద్యులు దూరంగా ఉండే గాయాలను గమనించి, ఎక్కువగా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసి అటు ఆర్థికభారం, ఇటు సమయం కూడా ఆదా చేస్తుంది.
దీంతోపాటు.. ప్రతి ఒక్కరికీ వాళ్ల పాదాల తీరు, సైజులకు అనుగుణంగా పాదరక్షలు తయారుచేసే ప్రత్యేకమైన మిషన్ ఒకదాన్ని ద ఫుట్ డాక్టర్ ఆస్పత్రిలో ఏర్పాటుచేశారు. దీనివల్ల రోగులు తమ కాళ్ల సమస్యలను త్వరగా గుర్తించడంతో పాటు నూరుశాతం కస్టమైజ్డ్ పాదరక్షలను పొందే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ల పాదాలకు సంపూర్ణ రక్షణ, సౌకర్యం లభించి.. కాళ్లు, పాదాలకు గాయాలు కాకుండా ఉంటాయి.
(చదవండి: డయాబెటిక్ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం)


