breaking news
Dasari durga prasad
-
ఆత్మనిగ్రహం... ఆత్మస్థైర్యం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిగురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అభివృద్ధి నిలిచిపోయి అథఃపాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు నిగ్రహించుకుంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో మనస్సును అధీనంలో ఉంచుకోవడమే ఆత్మ నిగ్రహం.చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. మనసును నిగ్రహించడం వాయువును బంధించడం కన్నా కష్టమైందని అర్జునుడే స్వయంగా అన్నాడు. భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు తనకు సారధ్యం వహిస్తున్న శ్రీ కృష్ణునితో అర్జునుడు ఈ మాటలు పలికాడు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, సహాధ్యాయ గురుపుత్రుడు అశ్వత్థామ, అన్నదమ్ములైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడి పోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని చేతిలో నుంచి ధనస్సును జార విడుస్తూ ‘‘కృష్ణా నాకు విజయం వద్దు... రాజ్య సుఖాలు వద్దు... ఆచార్యుణ్ణి, పితామహుణ్ణి, బంధువులను నేను సంహరించలేను’’ అంటూ మౌనం వహించి విముఖుడై కూర్చుండిపోయాడు. అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. అందువల్లనే అర్జునికి ఇలాంటి స్థితి ఏర్పడింది. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి అంగీకరించాడు. మనోనిగ్రహం పొందడం చేతనే అర్జునుడు తిరిగి మామూలు స్థితికి వచ్చాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్యసంధులుగా, న్యాయవేత్తలుగా, నీతిపరులుగా తీర్చిదిద్దుతుంది. మనో నిగ్రహం అలవడితే సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. అయితే ఆత్మ నిగ్రహానికి, ఆత్మస్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మ స్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ్రపోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ఆత్మ స్ధైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్య సాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతాభావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతివ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడుగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయలోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీత కూడా స్పష్టం చేసింది.– దాసరి దుర్గాప్రసాద్ -
స్వీయ క్రమశిక్షణ..
మనం అభివృద్ధి చేయగల అత్యంత ముఖ్యమైన జీవన నైపుణ్యాలలో స్వీయ–క్రమశిక్షణ ఒకటి. ఏదైనా ఒక పనిని మనం చేస్తున్నపుడు ఆ మార్గంలో ఎలాంటి ప్రలోభాలు, ఆకర్షణలు ఎదురైనా వాటికి ఏ మాత్రం ప్రభావితం కాకుండా మనస్సుని నియంత్రించుకుని.. చేస్తూన్న పనిపైనే సంపూర్ణమైన దృష్టిని కేంద్రీకరించడమే‘ స్వీయ క్రమశిక్షణ‘. స్వీయ–క్రమశిక్షణ ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది. నమ్మకమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఇది సమయపాలన కూడా నేర్పుతుంది. అలాగే, తనను తాను మలచుకోవడానికి, అభివృద్ధి సాధించడానికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరధ్యానాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే, ఒత్తిడిని దూరం చేస్తూ, కష్టతరమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా... ధైర్యంగా ఎలా ఉండవచ్చో అవగతం చేస్తుంది.వివిధ కార్యకలాపాలకు ఎలాంటి ప్రణాళికలు అవలంబించాలో, ఎలా నిర్వహించాలో నేర్పుతుంది. స్వీయ–క్రమశిక్షణ కలిగిన వారు తమ లక్ష్యాలపై దృష్టిసారిస్తే, పరీక్షలలో బాగా రాణించడానికి, వారి అభ్యాస లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఇతర జీవిత నైపుణ్యాల మాదిరిగానే, స్వీయ–క్రమశిక్షణలో ్రపావీణ్యం సంపాదించడానికి చాలా సంవత్సరాల అభ్యాసం అవసరం. అయితే ఇది బాహ్యంగా ఎవరో మనల్ని అదుపు చేస్తుంటే అలవరచుకునేదిలా కాకుండా మనకు మనమే పరి చేసుకునేలా ఉండాలి. గాంధీజీ, అబ్దుల్ కలామ్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహాం లింకన్, హెన్రీఫోర్డ్, ఆండ్రో కార్నెగీ, వాల్ట్ డిస్నీ, బరాక్ ఒబామా వంటి మహనీయులంతా తమ తమ జీవితాలలో పాటించిన ‘ స్వీయ క్రమశిక్షణ వల్లే ఉన్నత శిఖరాలకు చేరుకుని, జననీరాజనాలందుకున్నారు.కనుక స్వీయ క్రమశిక్షణను సరైన వయస్సులో నేర్పించి అలవాటు చేసినట్లయితే అది జీవితాంతం మన వ్యక్తిగత అభివృద్ధికి, విజయ సాధనకు సహాయపడుతుంది. స్వీయ క్రమశిక్షణను అలవరచుకోవడానికి ఎప్పటికప్పుడు మనల్ని ప్రేరేపించుకుని సాధన చేస్తే స్వీయ క్రమశిక్షణ మన సొంతమై, అనేక విజయాలను సంపాదించి పెడుతుంది. ఇది మన భవిష్యత్ గమ్యాన్ని దిశానిర్దేశం చేయడంతో పాటు, మన జీవితానికి ఓ అర్ధాన్ని, పరమార్థాన్ని అందించి పెడుతుంది. కనుక ఏ మనిషైతే స్వీయ క్రమశిక్షణను అలవరచుకుంటాడో, అలాంటి వారు జీవితంలో అత్యంత సులువుగా ఉన్నత శిఖరాలను చేరుకుంటారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించుకోదు."స్వీయ క్రమశిక్షణ అనేది ఓ గొప్ప వ్యక్తిత్వపు లక్షణం. ఇది నిరంతరం చేయాల్సిన తపస్సు లాంటిది. ఒకానొక విద్యార్థి తన జీవితంలో పాటించే స్వీయ క్రమశిక్షణ ఆ విద్యార్థి పూర్తి జీవితానికి బంగారు బాట అవుతుంది." – దాసరి దుర్గా ప్రసాద్ -
శివప్రీతికర క్షేత్రం... ముక్తిధామం
ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా విఖ్యాతిగాంచిన కాశీక్షేత్ర మహిమ, విశ్వనాథలింగ విశిష్టత విశేషమైనవి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నిరంతరం శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి మహాశ్మశానమని పేరు వచ్చింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెబుతున్నాయి. పురాతన శైవాధామాలలో ఒకటైన కాశీ సకల పాతక నాశినిగా, జ్ఞానప్రదాయినిగా, ముక్తిదాయినిగా పేరు గాంచింది. పావన గంగానదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శివపురి, ముక్తిభూమి, తపఃస్థలి, అవిముక్త్, వారణాసి తదితర పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య ఈ క్షేత్రం గురించి కాశీఖండంలో ప్రముఖంగా ప్రస్తావించారు. గంగానదీమతల్లి ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోనే ‘వరుణ’, ‘అసి’ నదులు గంగలో కలుస్తాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరొచ్చింది. ఇక్కడ మూడువేల సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతివారు నివసించేవారు. అందువల్ల దీనికి కాశీ అని పేరొచ్చింది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ కథనం. పురాతన కాలంలోని ఆలయాన్ని శివభక్తురాలైన అహల్యాబాయి హొల్కర్ 1777లో తిరిగి నిర్మించగా, పంజాబ్ కేసరి మహరాజా రణ్‌జీత్ సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకును తాపడం చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాశీక్షేత్రంలో కొలువైన కాశీవిశ్వనాథ లింగదర్శనం సర్వపాపహరణం. శివకైవల్య ప్రాప్తికి మూలం. గర్భాలయంలో కొలువైన విశ్వేశ్వరలింగం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఫలితాన్నివ్వడంలో మాత్రం పెద్దది. ఈ పవిత్రక్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంలో స్త్రీ పురుష భేదంతో రెండు రూపాల ధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి- శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై తపస్సు చేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమ స్థానం ఎంపిక చేశాడు. అప్పుడు నిర్గుణ శివుడు తన నుంచి సమస్త తేజస్సును ప్రోదిచేసి అత్యంత శోభాయమానమైన పంచకోశ నగరాన్ని నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచి శివునికై తపస్సు చేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి విస్మయం చెందిన విష్ణువు తల ఆడించగా ఆయన చెవి నుంచి ఒక మణి కింద పడింది. అప్పటినుంచి ఆ స్థానం మణికర్ణికగా పేరుగాంచింది. మణికర్ణిక ఐదుక్రోసుల విస్తారం గల సంపూర్ణ జలరాశిని శివుడు తన త్రిశూలంతో బంధించాడు. దానిలో విష్ణువు సతీసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞమేరకు విష్ణువు నాభినుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ ద్వారా అద్భుత సృష్టి జరిగింది. బ్రహ్మ, విష్ణు పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా శివకేశవుల దర్శనం కోరుకుంటారు. మోక్షప్రదాయిని అయిన ఈ క్షేత్రంలో చేసిన ఏ సత్కార్యమైనా సహస్ర కల్పాలలో కూడా క్షయం కాదు. బనారస్ అనే పేరు ఎందుకంటే..? బనారి నామధేయుడైన ఒక రాజు ఈ తీర్థస్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల ఆయన పేరుమీదుగా కాశీని బనారస్ అని కూడా పిలుస్తారు. బనారస్‌లో పదిహేనువందల దివ్య ఆలయాలున్నాయి. కాశీలోని గంగాజలాన్ని రామేశ్వర క్షేత్రాన ఉన్న రామేశ్వర లింగానికి అభిషేక జలంగా వినియోగిస్తారు. కాశీనగరంలో కాలభైరవుడు శునకవాహనుడై గస్తీ తిరుగుతుంటాడని ప్రతీతి. ఈ నగరం బ్రహ్మ సృష్టి కాకపోవడం వల్ల బ్రహ్మ ప్రళయానికి ఇది నశించదు. అలాగే గంగానదీ తీరాన కాశీక్షేత్రాన 64 స్నానఘట్టాలున్నాయి. ఇవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. అసీఘాట్, దశాశ్వమేద ఘాట్, వర్ణ సంగమ, పంచగంగ, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ముఖ్యమైనవి. ఈ దివ్యక్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయాలున్నాయి. వీటిలో బిందుమాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్వరుడి ఆలయాలు ముఖ్యమైనవి. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగాలలో హరిశ్చంద్రాది మహారాజులతోపాటు రామాయణ భారత భాగవత ప్రాశస్త్యం గల అపురూప క్షేత్రమిది. మోక్షపురాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి అక్షత్రయంలో ఒకటి , అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. మాతా అన్నపూర్ణేశ్వరాలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. కాశీపుణ్యక్షేత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్రమైన స్థానాలు. కాశీక్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తిమార్గాలుగా భావిస్తారు. కాశీక్షేత్ర సందర్శనం, కాశీవిశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యపలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు అంటుంటారు. - దాసరి దుర్గాప్రసాద్


