స్మార్ట్‌ఫోన్స్‌తో 12 ఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావం
పొంచి ఉన్న మానసిక అనారోగ్యం, ఊబకాయం
చుట్టుముడుతున్న నిరాశ, నిద్రలేమి సమస్యలు
స్క్రీన్ వినియోగం తగ్గించాలంటున్న నిపుణులు
తిండి, బట్ట, నీడ.. వాటి సరసన స్మార్ట్‌ఫోన్ కూడా వచ్చి చేరింది. ఎంతలా అంటే ఈ ఉపకరణం లేకుంటే జీవితమే లేదన్నంతగా. టీనేజ్‌కు రాకముందే పిల్లల వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండటం హానికరమని ఒక కొత్త అధ్యయనం తెలిపింది.
చంటి పిల్లలు ఏడవకుండా ఉండేందుకు తల్లిదండ్రులు వారి స్మార్ట్‌ఫోన్లలో వీడియోలను చూపిస్తున్నారు. పిల్లలకు నడక మొదలైన నాటి నుంచే వారికి మొబైల్ ఫోన్లు అలవాటు చేస్తున్నారు. ‘ఫోన్ ఇస్తే చాలు.. స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఓ మూలన కూర్చుంటారు. వాళ్లతో ఎటువంటి ఇబ్బంది ఉండదు’అనే ఆలోచనతో బలంగా అమలు చేస్తున్నారు. చదువు, విజ్ఞానం కోసం పిల్లలు స్మార్ట్ ఫోన్స్‌తో వెచి్చంచే సమయం పిసరంత అయితే.. వీడియో గేమ్స్, రీల్స్, చాటింగ్‌కు సమయం కొండంత ఉంటోంది.
అయితే పిల్లలకు స్మార్ట్‌ఫోన్స్ ఇవ్వడం స్వయంగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టినట్టేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 12 ఏళ్లలోపు పిల్లలు స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండటం వల్ల మానసిక అనారోగ్య సమస్యలు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు.. ఇతరులతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్స్ ఉన్న పిల్లల్లో నిరాశ, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.
ఎవరు విశ్లేషించారంటే..
యూఎస్‌లో 2018 నుంచి 2020 మధ్య కాలంలో అడాల్‌సెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ (ఏబీసీడీ) అధ్యయనంలో 10,588 మంది కౌమారదశ పిల్లలు పాలుపంచుకున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చిన ఈ అధ్యయనం యూఎస్‌లో ‘మెదడు అభివృద్ధి, పిల్లల ఆరోగ్యం’పై అతిపెద్ద దీర్ఘకాలిక అధ్యయనంగా నిలిచింది. చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్పియా, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయన సమాచారాన్ని విశ్లేషించారు.

వారి కంటే మెరుగ్గా..: ఏబీసీడీ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 63.6% మందికి స్మార్ట్‌ఫోన్స్ ఉన్నాయి. సగటున 11 ఏళ్లకే వారు ఈ ఉపకరణాన్ని దక్కించుకున్నారు. ఆ డేటా ఆధారంగా చిన్న పిల్లల వద్ద స్మార్ట్‌ఫోన్ ఉండటం వల్ల నిద్రలేమి, ఊబకాయం వంటి ప్రమాదాలు పెద్దవారి కంటే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు నిర్ధారించారు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నవారిలో తక్కువ వయసున్న పిల్లల్లో ఆరోగ్య ఫలితాలు మరింత దిగజారుతున్నాయని వెల్లడైంది. 12 సంవత్సరాల వయసులోపు స్మార్ట్‌ఫోన్ పొందిన పిల్లలను, స్మార్ట్‌ఫోన్ లేని పిల్లలను కూడా ఈ అధ్యయనం పోల్చింది.
ఒక సంవత్సరం తరువాత స్మార్ట్‌ఫోన్‌లు లేనివారు వాటిని కలిగి ఉన్న వారి కంటే మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నారని పరిశోధకులు కనుగొన్నారు. పిల్లల దగ్గర ట్యాబ్లెట్ పీసీలు లేదా ఐప్యాడ్స్ వంటి ఇతర పరికరాలు ఉండవచ్చని.. వాటి వినియోగం వల్ల కూడా ఫలితాలు ఇలాగే ఉంటాయని తెలిపారు.
ఓ కన్నేసి ఉంచండి..: అయితే స్మార్ట్‌ఫోన్లు కౌమారదశలో ఉన్న అందరి ఆరోగ్యానికి హానికరమని తాము చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సానుకూల, ప్రతికూల పరిణామాలను సమతౌల్యం చేస్తూ అధిక స్క్రీన్ వినియోగం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను జాగ్రత్తగా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఎంత సమయం వాడాలనే అంశాన్ని స్పష్టంగా వివరించాలన్నారు.
బెడ్‌రూమ్‌లో, భోజనం, హోంవర్క్ సమయంలో ఎలా వాడాలో తెలియజేయాలని... ప్రైవసీ, కంటెంట్ సెట్టింగ్స్‌ను మార్చాలని సూచిస్తున్నారు. పిల్లలు వారి ఫోన్లలో ఏమి చేస్తున్నారో పర్యవేక్షించాలని... అనుచితమైన కంటెంట్‌కు వారు గురికాకుండా, స్మార్ట్‌ఫోన్లు నిద్రకు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
⇒ ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్లలోపు పిల్లల్లో 71%, 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 42% మంది వద్ద సొంత స్మార్ట్‌ఫోన్ ఉంది.
⇒ ప్యూ రీసెర్చ్ ప్రకారం 2024లో 13–17 ఏళ్ల టీన్స్‌లో 95% మంది స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్నారు.
⇒ 12 ఏళ్లలోపు వారిలో 42% మంది ప్రతిరోజూ సగటున 2–4 గంటలు డిజిటల్ తెరల ముందు గడుపుతున్నారు.


