కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నల్లగొండ టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ఏం సాధించిందని ప్రజా పాలన విజయోత్సవాలను జరుపుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు తెలియజేయాలని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన నల్ల గొండలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ గత 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో అదే చేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పాటు అవినీతిలో కూడా గత బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలలో ఏమేమి అమలు చేశారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో సింగరేణి నుంచి హైటెక్ సిటీ వరకు భూముల అమ్మకాల్లో గత బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ సర్కార్ ముందు నిలిచిందన్నారు. భూముల ఆక్రమణలో మంత్రుల నుంచి కింది స్థాయి కాంగ్రెస్ నాయకుల వరకు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు పెద్దగా తేడా ఏమీ లేదన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


