గ్లోబల్‌ సమ్మిట్‌.. ఫ్యూచర్‌ సిటీలో సర్వం సిద్ధం | Telangana Rising Global Summit 2025 Details | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ సమ్మిట్‌.. ఫ్యూచర్‌ సిటీలో సర్వం సిద్ధం

Dec 8 2025 1:44 AM | Updated on Dec 8 2025 7:20 AM

Telangana Rising Global Summit 2025 Details
  • 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తి
  • తరలిరానున్న 2 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు
  • తొలిరోజు సదస్సును ప్రారంభించనున్న రాష్ట్ర గవర్నర్‌
  • రాష్ట్ర భవిష్యత్తుపై సీఎం రేవంత్‌ కీలక ప్రసంగం
  • రేపు ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047’ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2047లో వందేళ్లు పూర్తయ్యే నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025’కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌ శివారులోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన ప్రాంగణాన్ని సృజనాత్మకత, డిజిటల్‌ సాంకేతికత మేళవింపుతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేశ విదేశాల నుంచి అతిథులు, ప్రతినిధులు సుమారు 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే సదస్సు ప్రారంభ వేడుకను రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించనున్నారు.

రెండు రోజుల్లో 27 అంశాలపై చర్చాగోష్టిలు
ఈ అంతర్జాతీయ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. అత్యధికంగా అమెరికా నుంచి 46 దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రతినిధులు రానున్నారు. ఫారŠూచ్యన్‌–500 కంపెనీల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో 27 అంశాలపై చర్చాగోష్టిలు జరుగుతాయి. రెండో రోజు మంగళవారం అత్యంత కీలకమైన ‘తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ 2047’ను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం వైపు నుంచి అందించే సహకారం, విజన్‌ 2047 డాక్యుమెంట్‌ లక్ష్యాలు, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ఏర్పాటు లక్ష్యాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆహూతులకు వివరిస్తారు.

ఏర్పాట్లు పరిశీలించిన పొంగులేటి, పొన్నం
సదస్సు కోసం ఫ్యూచర్‌ సిటీలో సుమారు 80 ఎకరాల సువిశాల ప్రాంతాన్ని 8 జోన్లు, 33 క్లస్లర్లుగా విభజించి ఏర్పాట్లు చేశారు. 14 వేల చదరపు మీటర్ల విస్త్రీర్ణంలో రెండు ప్రధాన సమావేశ మందిరాలతో పాటు మరో 6 ప్రత్యేక ప్రాంగణాలను చర్చా గోష్టిలు, అతిథులు, ప్రతినిధుల భోజనాల కోసం ఏర్పాటు చేశారు.  ప్రధాన సమావేశ మందిరాల్లో 2,500 మంది, సెషన్‌ హాల్స్‌లో 200 మంది కూర్చునే అవకాశం ఉంది. కాగా సదస్సు ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

విజయవంతంగా డ్రై రన్‌
సదస్సు ఏర్పాట్లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకునే ‘డ్రై రన్‌’ను ఆదివారం సాయంత్రం అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 25 ప్రభుత్వ విభాగాలు 25 రోజుల పాటు కలిసికట్టుగా పనిచేసి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్, మంచినీరు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్‌ సేవలు సహా ఏసీలు, 3డీ, ఎల్‌సీడీ ప్రొజెక్టర్లు, లైటింగ్, సౌండ్‌ సిస్టమ్‌ తదితరాలు పరీక్షించారు. కాగా దారి పొడవునా సైన్‌ బోర్డులతో రాక పోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన మూడు హెలీప్యాడ్‌లు సహా వచ్చి పోయే మార్గాలను తనిఖీ చేశారు.

వెయ్యి సీసీ కెమెరాలతో నిఘా
గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రాంగణంపై 1,000 సీసీ కెమెరాలు నిరంతరం నిఘా వేసి ఉంచుతాయి. ప్రధాన వేదిక చుట్టూ వెయ్యి మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఔటర్‌ రింగు రోడ్డు తుక్కుగూడ ఎగ్జిట్‌ నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీ మార్గంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారు. ఫ్యూచర్‌ సిటీకి దారి తీసే మార్గాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుని రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రధాన వేదిక సమీపంలోకి వీఐపీల వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించరు.

మరిన్ని ఏర్పాట్లు.. విశేషాలు

  • తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలో ముద్రించిన తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రతినిధులకు అందజేస్తారు.

  • అతిథులను ఆకట్టుకునేలా 50 మీటర్ల స్వాగత ద్వారం, 3 డీ టన్నెల్, ప్రారంభ వేదిక ముందు భాగంలో 85 మీటర్ల ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథుల విశాంత్రి కోసం ప్రత్యేక గదులను సిద్ధం చేశారు.

  • రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా ఒక 100 కేవీఏ, రెండు 160 కేవీఏ, రెండు 315 కేవీఏ సామర్థ్యంతో కూడిన ట్రాన్స్‌ఫార్మర్లు, మరో మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను సిద్ధం చేశారు. ఎస్‌పీడీసీఎల్‌ ఆపరేష¯న్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నరసింహులు నేతత్వంలో 150 మంది ఇంజనీర్ల బృందం విద్యుత్‌ సరఫరాను పర్యవేక్షిస్తుంది.

  • తెలంగాణ ఆర్థిక ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ప్రదేశాలు, ప్రభుత్వ లక్ష్యాలు ఎల్‌ఈడీ తెరపై ప్రదర్శితమవుతుంటాయి. ఇదే ప్రాంతంలో ఫొటో సెషన్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • వీఐపీలు, ప్రతినిధులు, జర్నలిస్టులు సహా వివిధ విభాగాల అధికారులకు మొత్తం పది వేల మందికి ఉచిత వైఫై సౌకర్యం కల్పించేలా తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ సహాకారంతో 5 జీడేటా (10 జీబీపీఎస్‌ వేగం)తో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటాయి.

  • అత్యవసర వైద్య సేవల కోసం 10 పడకల ఆసుపత్రి, 108 సర్వీసులతో పాటు చికిత్సకు అవసరమైన వైద్య సిబ్బంది, మందులను అందుబాటులో ఉంచారు.

  • అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రాంగణానికి నాలుగు వైపులా నాలుగు ఫైర్‌ ఇంజన్లను నిలిపి ఉంచారు.

  • 56 గ్రామాలు..765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీ సహా భవిష్యత్తులో ఇక్కడ ఏ ఏ ప్రాజెక్టులు రాబోతోంది? వచ్చే మూడేళ్లలో ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతోంది? జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడబోతున్నాయి? వంటి అంశాలను వివరించేలా హైదరాబాద్‌ నగరం సహా మీర్‌ఖాన్‌పేట వేదికగా నిర్వహించే సమ్మిట్‌ ప్రాంగణాన్ని డిజిటల్‌ తెరలతో నింపారు.

  • అతిథులకు తెలంగాణ పర్యటన ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్లోబల్‌ సమ్మిట్‌ డెలిగేట్లకు ప్రత్యేక సావనీర్లతో కూడిన బహుమతిని అందించనున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌ లోగోతో పాటు, పోచంపల్లి ఇక్కత్‌ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తరు, ముత్యాలతో కూడిన నగలను ఇందులో పొందుపరిచారు.

  • తెలంగాణకే ప్రత్యేక వంటలైన ఇప్ప పువ్వు లడ్డు, సకినాలు, చెక్కలు, బాదం కీ జాలి, నువ్వుల ఉండలు, మక్క పేలాలతో కూడిన మరో ప్రత్యేక బాస్కెట్‌ను కూడా అతిథులకు అందజేస్తారు.

  • సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరి, తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ము కోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల వంటి సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది.

  • నాగార్జున సాగర్‌ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్‌ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

  • రెండు రోజుల పాటు అతిథులు, ప్రతినిధులకు హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ధ వంటకాలను రుచి చూపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement