రెండోవిడతలో 8304 వార్డులు కూడా
మిగిలిన 3,911 సర్పంచ్, 29,903 వార్డులకు ఎన్నికలు
బరిలో మొత్తం 78,158 మంది అభ్యర్థులు..14న పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ విడతలో 38,322 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక మిగిలిన 29,903 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మొత్తంగా 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఏకగ్రీవాల్లో కామారెడ్డి టాప్
రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 197 పంచాయతీలుండగా, అత్యధికంగా 44 ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 196 పంచాయతీలకు 38, నల్లగొండ జిల్లాలో 282 పంచాయతీలకు 38 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లోనూ కామారెడ్డి జిల్లానే టాప్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 1,654 వార్డులుండగా, 776 ఏకగ్రీవమయ్యాయి.
నిజామాబాద్ జిల్లాలో 1,760 వార్డులకు 674, నల్లగొండ జిల్లాలో 2,418 వార్డులకు 553 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా కేవలం ఒక సర్పంచ్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో కేవలం 2 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. \రెండో విడతలో 10 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన చోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. సర్పంచ్ స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు, వార్డుకు సగటున ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. రెండో విడత పోలింగ్ 14వ తేదీన జరగనుండగా, అదే రోజు విజేతలను ప్రకటిస్తారు.
మూడోవిడత నామినేషన్ల లెక్క తేలగా.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 9న ఉపసంహరణ ఉంటుంది.
సండే స్పెషల్.. చికెన్ టోకెన్స్
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలోని ఓ వార్డు అభ్యర్థి తమ ఓటర్లకు ఆదివారం స్పెషల్‌గా చికెన్ టోకెన్స్ అందజేశాడు. రెండు చికెన్ సెంటర్లను ఎంచుకొని శనివారం రాత్రే వారికి టోకెన్లు అందజేశాడు. దీంతో ఆ వార్డు ఓటర్లు ఉదయం చికెన్ సెంటర్లకు వెళ్లి అభ్యర్థి రాసి ఇచి్చన టోకెన్ చూపించి చికెన్ తెచ్చుకున్నారు.ఇదీ ఎన్నికల సండే స్పెషల్ చికెన్ అంటూ ఆరగించారు.
జనాభా కన్నా ఓటర్లే ఎక్కువట
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన జనాభా, ఓటర్ల వివరాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. సూర్యతండా గ్రామ జనాభా 498 మంది, ఓటర్లు 499 మందిగా ఉంది.
అంటే అధికారుల లెక్కల ప్రకారం జనాభా కన్నా ఓటర్లే ఎక్కువ అన్నమాట. అలాగే కొనాయమాకుల గ్రామపంచాయతీ జనాభా 850, ఓటర్లు 916 మంది, గంగదేవిపల్లి జనాభా 1,080, ఓటర్లు 1,118 మంది ఉన్నట్టు అధికారులు రూపొందించిన క్లస్టర్ల వారీ జనాభా, ఓటర్ల జాబితాలో నమోదై ఉంది.
గెలిపిస్తే.. ఐదేళ్లు కేబుల్ కనెక్షన్ ఉచితం
నర్సాపూర్ రూరల్: సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేళ్లు కేబుల్ టీవీ కనెక్షన్ ఉచితంగా ఇస్తానని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నయ్యపల్లి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ నీలి బిక్షపతి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం ప్రారంభించాడు. మహిళలకు కుట్టు మెషీన్‌ల పంపిణీతో పాటు టైలరింగ్ శిక్షణ ఇప్పిస్తానని, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పాడు.
ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎమ్మెల్యే కౌసర్ భార్య
వెల్దుర్తి: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ సతీమణి, జీహెచ్‌ఎంసీ మాజీ కార్పొరేటర్ నజ్మాసుల్తానా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ స్థానానికి నజ్మాసుల్తానాతోపాటు కాసాల ఇందిర నామినేషన్ వేశారు.
అయితే కాసాల ఇందిర తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవడంతో నజ్మా సుల్తానా సర్పంచ్‌గా ఏకగ్రీవం కానున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు అప్సర్ 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బస్వాపూర్ నుంచి సర్పంచ్‌గా పోటీ చేసి 63 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అదే గ్రామంలోనే ఇప్పుడు తల్లి ఏకగ్రీవ సర్పంచ్ అయ్యారు.


