ఊరూరా యాదగిరి శ్రీలక్ష్మీ నృసింహుడి కల్యాణాలు.. ప్రత్యేక పూజలు
భూపాలపల్లి నుంచి త్వరలో శ్రీకారం
యాదగిరిగుట్ట: తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించలేని భక్త జనులకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శుభవార్త చెప్పింది. మారుమూల ప్రాంతాల నుంచి యాదగిరికొండకు రాలేని భక్తుల చెంతకే భగవంతుడు వెళ్లనున్నారు. ఆది దేవుడిని పల్లెకు వేంచేయింపజేసే కార్యక్రమానికి దేవస్థానం అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 20న భూపాలపల్లిలో శ్రీస్వామివారి కల్యాణం, వివిధ రకాల పూజలు భక్తుల సమక్షంలో జరగనున్నాయి. 27వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ఈ రెండు పర్యటనల తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు.
ప్రచార రథం సిద్ధం..
పల్లెలకు వెళ్లేందుకు స్వామి వారి ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. కొంత కాలంగా మరమ్మతులకు నోచుకోని ప్రచార రథాన్ని ఈఓ ప్రత్యేక శ్రద్ధతో మరమ్మతులు చేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం ఈవో వెంకట్రావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. మొదటగా భక్తులు తక్కువ సంఖ్యలో యాదగిరి క్షేత్రానికి వస్తున్న భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ప్రచారరథం ద్వారా శ్రీస్వామి వారి ఆశీస్సులు భక్తులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
నోడల్ అధికారుల నియామకం..
స్వామి వారి కల్యాణోత్సవాలను నిర్వహించేందుకు ఇద్దరు ఏఈఓలను ఈఓ వెంకట్రావ్ నియమించారు. భూపాలపల్లిలో జరిగే కల్యాణోత్సవానికి యాదగిరి క్షేత్రం ఏఈఓ నవీన్, నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే కల్యాణానికి ఏఈఓ జి.రఘులను నోడల్ అధికారులుగా నియమించారు. వీరిద్దరూ ఆయా ప్రాంతాల అధికారులు, ప్రముఖులతో సమన్వయం చేసుకొని కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు.
గతంలో విదేశాల్లో..
యాదగిరీశుడి కల్యాణోత్సవాలు, వివిధ పూజాది కార్యక్రమాలను విదేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, తెలంగాణ నుంచి వెళ్లి వివిధ దేశాల్లో స్థిరపడినవారు ప్రభుత్వం, ఆలయాధికారులతో మాట్లాడి అక్కడ నిర్వహించుకునేవారు. 2016లో తెలంగాణ ఆటా ఉత్సవాల్లో భాగంగా మొదటిసారిగా అమెరికాలోని మెచిగాన్‌లో శ్రీస్వామి వారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా, కెనడా, ఓమాన్, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాలు, వివిధ పూజలు నిర్వహించారు. కానీ తెలంగాణాతోపాటు ఏపీలోనూ స్వామి వారి వైభవాన్ని ప్రచారం చేసే కార్యక్రమాలు చేపట్టలేదు. దీంతో ఈఓ వెంకట్రావ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యాదగిరీశుడి వైభవాన్ని చాటి చెప్పేందుకు చర్యలు చేపట్టారు.
ఈ నెల 20 నుంచి ప్రారంభం
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైభవాన్ని ప్రజలందరికీ తెలియజేసేందుకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి, 27వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామంలో శ్రీస్వామి వారి ఉత్సవాలను భక్తుల కోరిక మేరకు నిర్వహించేందుకు సిద్ధమయ్యాం. యాదగిరి క్షేత్రానికి భక్తులను మరింతగా తీసుకువచ్చేలా కృషి చేస్తాం. – వెంకట్రావ్, ఈఓ, యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం


