అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లతో కొందరు విజిలెన్స్ సిబ్బంది మిలాఖత్
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సన్నబియ్యం అమ్మకాలు, రీ సైక్లింగ్
సాక్షి, హైదరాబాద్: ‘హలో.. ఫలానా రోజు మీ రైస్‌మిల్లుపై దాడులు జరిగే అవకాశముంది. రీ సైక్లింగ్ బియ్యం, లెక్కల్లోకి రాని వడ్లు మిల్లులో లేకుండా చూసుకోండి. స్టేట్ నుంచి మా బాస్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. జాగ్రత్త..’అంటూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ అప్పగింతల్లో అక్రమాలకు పాల్పడే మిల్లులకు ఇలాంటి ఫోన్‌కాల్స్ సర్వసాధారణంగా మారాయి.
పౌర సరఫరాల సంస్థను గాడి లో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ స్థాయిలో ఐపీఎస్ అధికారులను నియమించి, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేయాలని చూస్తుంటే, కంచె చేను మేసినట్టు విజిలెన్స్ విభాగంలోని కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా, ప్రతినెలా రూ.లక్షల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్న వారికి వేతనాల రూపంలో చెల్లించాల్సి వస్తోంది.
వివిధ కారణాల వల్ల నాన్ ఫోకల్‌లో పనిచేసే పోలీస్ శాఖలోని వివిధ హోదాల్లోని వారితోపాటు ఉద్యోగ విరమణ చేసిన పోలీసులను పౌరసరఫరాల సంస్థకు అనుబంధంగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో నియమించారు. రిటైర్డ్ ఉద్యోగులు 20 మంది వరకు పదేళ్లుగా ఈ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండగా, సర్వీస్‌లో ఉన్న మరో 30 మందిని గత సంవత్సరం ఆగస్టులో నియమించారు.
వీరిలో ఉన్నతస్థాయిలో ఉన్న కొందరిని మినహాయిస్తే, జిల్లాల బాధ్యతలు తీసుకున్న పలువురు విజిలెన్స్ అధికారులు సంస్థకే భారంగా తయారయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ విభాగ పనితీరుపై దృష్టి పెట్టినట్టు తెలిసింది.
పెరుగుతున్న అప్పులు... విజిలెన్స్‌లో కొరవడిన చిత్తశుద్ధి
ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగింత, పీడీఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమాల కోసం పౌర సరఫరాల సంస్థ ఏటా రూ. వేలకోట్లు ఖర్చు చేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూచీగా ఉండి అప్పులు ఇప్పిస్తోంది. ఈ లెక్కన ఇప్పటి వరకు సంస్థ అప్పులు రూ.70వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. అదే సమయంలో మిల్లర్ల అక్రమాలు పెరిగిపోయాయి. 2022–23 రబీ సీజన్‌కు సంబంధించి మిల్లర్లు అమ్ముకున్న రూ.7వేల కోట్ల విలువైన ధాన్యంలో నానాకష్టాలు పడి రూ. 4వేల కోట్ల వరకు రికవరీ చేశారు.
ఇంకా రూ. 3వేల కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగడం లేదు. ప్రభుత్వం రూ.వేలకోట్లు అదనంగా వెచ్చించి సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా, దళారుల ద్వారా రైస్‌మిల్లర్లు సన్నబియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ తరహా అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు.
సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, ఖమ్మం, మహబూబాబాద్ మొదలైన జిల్లాల్లో విజిలెన్స్ దాడులు జరిగినప్పుడు గానీ, జరగకముందు గానీ మిల్లర్లతో మిలాఖత్ అయిన ఘటనలే ఎక్కువ అనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేయడంతో చాలాచోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు, రేషన్ డీలర్లు, మిల్లర్లు, సంఘ నాయకులతో సత్సంబంధాలున్నాయి.
కొన్నిచోట్ల అధికారులు కొత్త మిల్లుల ప్రారంబోత్సవాలకు హాజరవుతున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో అక్రమాలు వెలికితీసే అధికారులు పారదర్శకంగా ఎలా పని చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గత రెండేళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు పరిశీలిస్తే 120 కేసులు నమోదు చేయగా, మిల్లుల్లో రూ.3వేల కోట్ల రికవరీ జరగలేదు.


